Share News

మెడికల్‌ కాలేజీల అధిక ఫీజులపై కోర్టుకెళ్తాం..

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:48 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆహార సౌకర్యాలు కొరవడ్డాయని తెలంగాణ మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది.

మెడికల్‌ కాలేజీల అధిక ఫీజులపై కోర్టుకెళ్తాం..

  • మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆహార సౌకర్యాలు కొరవడ్డాయని తెలంగాణ మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. వాటి హాస్టళ్లలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతవుతున్నారని పేర్కొంది. పలు కాలేజీలు సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని సర్కారును డిమాండ్‌ చేసింది. దీనిపై అసోసియేషన్‌ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను కలవాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి మాట్లాడుతూ.. బి-కేటగిరీలో 4.5 ఏళ్లకు మాత్రమే ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం, ఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసినా కొన్ని కాలేజీలు 5 ఏళ్ల ఫీజు తప్పనిసరిగా కట్టాలని మొండిగా వేధిస్తున్నాయన్నారు. కరీంనగర్‌లోని చల్మెడ కాలేజీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అటువంటి కాలేజీలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చల్మెడ కాలేజీ మొండి వైఖరికి నిరసనగా అతి త్వరలో తల్లిదండ్రులు అందరూ కలిసి కరీంనగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అసోసియేషన్‌ నిర్ణయించింది.

Updated Date - Jun 15 , 2026 | 04:48 AM