Share News

మెడికల్‌ కాలేజీల్లో భౌతిక తనిఖీలు బంద్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:07 AM

వైద్య కళాశాలల్లో తనిఖీ నిబంధనల్లో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీసుకొచ్చిన మార్పులతో వైద్య విద్యలో నాణ్యత తగ్గుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మెడికల్‌ కాలేజీల్లో భౌతిక తనిఖీలు బంద్‌

  • వర్చువల్‌ తనిఖీలకే పరిమితమవుతున్న ఎన్‌ఎంసీ

  • రెండేళ్లుగా ఇదే తంతు.. కాలేజీల ఇష్టారాజ్యం

  • ప్రత్యక్ష పర్యవేక్షణ లేక వైద్య విద్యలో తగ్గుతున్న నాణ్యత

  • నిబంధనల వూర్పుతో నష్టమంటున్న నిపుణులు

  • ఎంసీఐ ఉన్నప్పుడు వరుసగా తనిఖీలు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో తనిఖీ నిబంధనల్లో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీసుకొచ్చిన మార్పులతో వైద్య విద్యలో నాణ్యత తగ్గుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాలేజీల్లో ఎన్‌ఎంసీ భౌతిక తనిఖీలు నిర్వహించడం దాదాపు ఆపేసింది. వర్చువల్‌ పద్ధతిలోనే తనిఖీలు అధికంగా నిర్వహిస్తోంది. ఈ వర్చువల్‌ తనిఖీలను పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు మేనేజ్‌ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భౌతిక తనిఖీలు లేకపోవడంతో కాలేజీలపై ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండటం లేదు. దీంతో వైద్యవిద్య నాణత్య దెబ్బతింటోందని వైద్య రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఉన్నప్పుడు మెడికల్‌ కాలేజీల్లో ఏటా క్రమం తప్పకుండా భౌతిక తనిఖీలు జరిగేవని గుర్తు చేస్తున్నారు.


యాన్యువల్‌ డిక్లరేషన్‌తో సరి..

ఎన్‌ఎంసీ తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు మెడికల్‌ కాలేజీలకు వరంగా మారాయనే విమర్శలున్నాయి. గతంలో కొత్తగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే.. వరుసగా ఐదేళ్లపాటు ఏటా భౌతిక తనిఖీలు చేసేవారు. ఆకస్మిక భౌతిక తనిఖీల్లో నిబంధనల మేరకు సౌకర్యాలు లేవని గుర్తిస్తే.. ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతోపాటు ఎంబీబీఎస్‌ సీట్లలో కోత విధించడం, కొన్నిసార్లు వరుసగా ఒకటి, రెండేళ్లపాటు అడ్మిషన్లు నిలపివేయడం లాంటి కఠిన చర్యలు తీసుకునేవారు. దీంతో కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకుల దగ్గరి నుంచి, మౌలిక సదుపాయాల వరకు అన్నీ నిబంధనల మేరకుఉండేలా జాగ్రత్తలు తీసుకునేవి. అలాగే, కొత్తగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాతనే పీజీ సీట్లకు అనుమతిచ్చేవారు. అది కూడా పారా పీజీ సీట్లకే. కళాశాల ప్రారంభించిన ఐదేళ్ల తర్వాతనే క్లినికల్‌ పీజీ సీట్లకు అనుమతిచ్చేవారు. ఏదైనా కాలేజీ యూజీ సీట్ల సంఖ్యను పెంచుకుని, వాటికి అనుమతులు సాధిస్తే.. మళ్లీ వరుసగా ఐదేళ్లపాటు భౌతిక తనిఖీలు నిర్వహించేవారు. ఎంసీఐ స్థానంలో ఎన్‌ఎంసీని తీసుకొచ్చిన తర్వాత అనేక విషయాల్లో నిబంధనలు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం భౌతిక తనిఖీల స్థానంలో యాన్యువల్‌ డిక్లరేషన్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో కాలేజీల యాజమాన్యాలు ఒక ఏడాది కాలంలో తమ బోధనాస్పత్రుల్లో నమోదైన అవుట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వివరాలతో పాటు జరిగిన సర్జరీలు, టెస్టులు, స్కానింగ్స్‌, ప్రసవాలు, అధ్యాపకులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను ఎన్‌ఎంసీ నిర్దేశించిన వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలాగే బోధనాస్పత్రుల్లోని సీసీ కెమెరాల ద్వారా ఢిల్లీలోని ఎన్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరును నిత్యం పర్యవేక్షిస్తుంటారు. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ విభాగాల నుంచి అయా బోధనాస్పత్రుల్లో నమోదైన ప్రసవాలు, ఇతర వివరాలను కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ వివరాలను కాలేజీలు ఇచ్చిన యాన్యువల్‌ డిక్లరేషన్‌లోని సమాచారంతో ఎన్‌ఎంసీ పోల్చి చూస్తుంది. సమాచారంలో తేడా ఉంటే సంబంధిత కాలేజీకి షోకాజ్‌ నోటీసు జారీ చేస్తుంది. పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధిస్తోంది. అయితే, మెజార్టీ ప్రైవేటు కాలేజీలు ఎన్‌ఎంసీ విధించే జరిమానాలను కట్టి, మళ్లీ మామూలుగానే తమ వ్యవహారాలను నడుపుకొంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా మెడికల్‌ కాలేజీకి అనుమతి ఇచ్చేముందే గతంలో ఎంసీఐ భౌతిక తనిఖీలు నిర్వహించేది. నిబంధనల మేరకు సదుపాయాలు, అనుబంధ ఆస్పత్రి ఉంటేనే లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ ఇచ్చేది. ఇప్పుడు వర్చువల్‌ తనిఖీల ద్వారానే కొత్త కాలేజీలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వర్చువల్‌ తనిఖీలకే పరిమితం అవుతున్నారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటై ఏడాది కాగానే పీజీ సీట్లకు అనుమతులు ఇస్తున్నారు. యూజీ సీట్లను కూడా కాలేజీ ప్రారంభమైన మరుసటి ఏడాది నుంచే పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిర్ణయాలతో వైద్య విద్యలో నాణ్యత దెబ్బతింటోందని నిపుణులు అంటున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:07 AM