Share News

మేడారంలో శాశ్వత బస్టాండ్‌ నిర్మాణానికి కృషి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:02 AM

మేడారంలో శాశ్వత బస్టాండ్‌ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శనివారం ఆయన పర్యటించారు..

మేడారంలో శాశ్వత బస్టాండ్‌ నిర్మాణానికి కృషి

  • జాతరకు 4 వేల బస్సులు.. అవసరమైతే మరిన్ని: పొన్నం.. మహిళా భక్తులకు ‘మహాలక్ష్మి’ వర్తిస్తుంది: సీతక్క

  • సిరిసిల్లలో బెల్లం కొనాలంటే ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సిందే

  • మహాజాతరపై గిరిజన వర్సిటీ తరఫున సమగ్ర పరిశోధన

ములుగు, సిరిసిల్ల, హనుమకొండ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మేడారంలో శాశ్వత బస్టాండ్‌ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శనివారం ఆయన పర్యటించారు. మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. వనదేవతలను దర్శించుకున్న మంత్రులు ఆ తర్వాత ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు. ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నుంచి 4 వేల బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని చెప్పారు. భక్తుల రద్దీని బట్టి పెంచుతామన్నారు. భక్తులను బస్సులు గద్దెల సమీపం వరకు తీసుకొస్తాయని చెప్పారు. కాగా, మహాలక్ష్మి పథకం కింద ఉచితప్రయాణం మేడారం వచ్చే మహిళా భక్తులకూ వర్తిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో రూ.5 కోట్లతో అధునాతన బస్టాండ్‌, రూ.7 కోట్లతో ఏటూరునాగారంలో బస్‌డిపో నిర్మిస్తున్నామన్నారు. కాగా, మేడారం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం 50 ప్రత్యేక క్యూలైన్లను అందుబాటులో ఉం చారు. ఇక వనదేవతలకు సమర్పించుకునే బెల్లం (బంగారం) కోసం సిరిసిల్ల జిల్లాలో భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆధార్‌ వివరాలు సమర్పిస్తేనే భక్తులకు బెల్లం అమ్ముతున్నారు. గుడుంబా తయారీకి బెల్లా న్ని తరలిస్తారన్న అనుమానాలతోనే ఎక్సైజ్‌ అధికారులు ఈ నిబంధన పెట్టారని తెలుస్తోంది. మరోవైపు.. బెల్లం అందుబాటులో లేక భక్తులు బంగారంగా చక్కెరనూ సమర్పించుకుంటున్నా రు. మేడారంలో శనివారం 2లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఇక.. మేడారం జాతరపై సమగ్ర పరిశోధన చేపడతామని ములుగులోని గిరిజన వర్సిటీ వీసీ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 03:02 AM