Share News

ఓటర్లను ఆకట్టుకునే పనిలో.. మునిసిపల్‌ ఎన్నికల అభ్యర్థులు..

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:06 AM

మునిసిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో.....

ఓటర్లను ఆకట్టుకునే పనిలో.. మునిసిపల్‌ ఎన్నికల అభ్యర్థులు..

  • ఇంటింటా మటన్‌, చికెన్‌, బాస్మతి బియ్యం పంపిణీ చేసిన మునిసిపల్‌ ఎన్నికల అభ్యర్థులు

  • పురుషుల కోసం మందు పార్టీలు

మేడ్చల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునిసిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే డబ్బులు, చీరలు పంచుతుండగా ఆదివారం సెలవు దినం కావడంతో మందు, విందులను ఏర్పాటు చేశారు. కొన్ని వార్డుల్లో ఇంటింటికి కిలో బాస్మతి బియ్యం, మటన్‌, మందు బాటిల్‌ను ఇవ్వగా మరికొన్ని వార్డుల్లో మటన్‌, చికెన్‌ వండి ఏకంగా మందు పార్టీలను ఏర్పాటు చేశారు. మూడుచింతల పల్లి, ఆలియాబాద్‌, ఎల్లంపేట్‌ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో మద్యం, మాంసం పంపకాలతో ఎన్నికల కోలాహలం కనబడింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి పంపకాలు జోరుగా జరిపినట్టు తెలిసింది. దీనికి తోడు వార్డుల్లోని యువకులకు గ్రామ శివార్లలో టెంట్లు వేసి మందు పార్టీలు ఏర్పాటు చేసిన దాఖలాలు కనబడ్డాయి. యువజన, కుల సంఘాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు మందు, విందులు కొనసాగాయి.

మునిసిపల్‌ చైర్మన్‌ పీఠాలు ఆశించే నేతలపై పెరిగిన భారం

మునిసిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతలు తమ వార్డుతో పాటు ఇతర వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధుల విజయం కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద మందు విందులను ఏర్పాటు చేస్తునట్లు సమాచారం. చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారు ప్రతీ వార్డుకు సరిపడా మద్యాన్ని సరఫరా చేయాలని పార్టీ అధిష్ఠానాలు ఆదేశించడంతో మద్యం పంపకం వ్యవహారం మరో రెండ్రోజుల పాటు మరింత ఊపందుకునే వీలు లేకపోలేదు. ప్రతి అభ్యర్థి ఖర్చు రూ. లక్షకు మించరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడుతున్నాయి.

Updated Date - Feb 09 , 2026 | 07:50 AM