మల్లారెడ్డి కారుపై కోడిగుడ్లు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:33 AM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేటలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది.
మేడ్చల్ జిల్లా లాల్‌గడి మలక్‌పేటలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ
ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
మల్లారెడ్డి కారు ధ్వంసం, ఆయన అనుచరుడికి గాయాలు
మేడ్చల్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేటలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. అలియాబాద్ 14వ వార్డులోని బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తమ పార్టీ శ్రేణులతో శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ ఎన్నికల ప్రచార రథం పెద్ద శబ్ధంతో పాటలను వినిపిస్తూ అటువైపు వచ్చింది. ఈ విషయంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈక్రమంలో జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు కిందపడిపోగా అతడి తలకు గాయమైంది. అలాగే, ఎమ్మెల్యే మల్లారెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కారును ధ్వంసం చేశాయి. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఇరుపార్టీల కార్యకర్తలు పెద్దసంఖ్యలో అలియాబాద్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఆ పార్టీ శ్రేణులు జీనోమ్ వ్యాలీ పోలీ్‌సస్టేషన్ వద్ద నిరసన తెలిపాయి. ఆపై, ఇరుపార్టీల నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువర్గాల నుంచి 4 ఫిర్యాదులు అందాయని దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమను చంపేందుకే మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. మైకు సౌండ్ తగ్గించమన్నందుకు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న మల్లారెడ్డి గుండాగిరి ఇక చెల్లదని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్ అన్నారు. ఽమల్లారెడ్డి ధన రాజకీయం ఇక నడవదన్నారు.