Share News

మేడారం పయనమైన పగిడిద్దరాజు

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:28 AM

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డలో అంకురార్పణ జరిగింది.

మేడారం పయనమైన పగిడిద్దరాజు

  • రేపటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌, ములుగు, తాడ్వాయి, గుండాల, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డలో అంకురార్పణ జరిగింది. వనదేవత సమ్మక్కను వివాహం చేసుకునేందుకు వేపలగడ్డలో పెళ్లి కుమారుడిగా ముస్తాబై పగిడిద్దరాజు మేడారం బాట పట్టారు. సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు వేపలగడ్డ నుంచి మేడారం చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది. సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు అర్రెం వంశానికి చెందిన పగిడిద్దరాజును వేపలగడ్డ గ్రామానికి చెందిన అర్రెం వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శివసత్తుల పూనకాలతో డోలీవాయిద్యాల మధ్య ఆదివాసీ సంప్రదాయాలతో పగిడిద్దరాజును గర్భగుడి నుంచి గద్దెలపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. గద్దెలనుంచి పగిడిద్దరాజు పడిగలతో కాలినడకన మేడారం జాతరకు పయనమయ్యారు. గ్రామగ్రామాన భక్తుల మొక్కులతో 2రోజులపాటు ప్రయాణం సాగనుంది. 70కిలోమీటర్లు కాలినడక ప్రయాణంలో వీరితోపాటు మహబూబాబాద్‌ జిల్లా పూనుగొడ్ల గ్రామానికి చెందిన పెనక వంశీయులు లక్ష్మీపురంలో కలుసుకుంటారు. మహాజాతర ప్రారంభానికి ముందురోజు జంపన్న వాగు ప్రాంతంలో బస చేస్తారు. పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క దేవతల ప్రవేశంతో, మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది.

మహా జాతరకు సర్వం సిద్ధం

మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి 4రోజులపాటు మహాజాతర జరగనుంది. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం 8జోన్లు, 42సెక్టర్లుగా జాతరను విభజించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 21శాఖలకు చెందిన 42,027మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఏఐ సహకారంతో అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలీసుశాఖ సన్నద్ధమైంది.

Updated Date - Jan 27 , 2026 | 03:28 AM