Share News

మేడారం జాతర మూలాలపై పరిశోధన ఏది?

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:35 AM

సమ్మక్క, సారలమ్మ జాతర పూర్వాపరాలపై ఇప్పటివరకు పరిశోధన జరగలేదు. ఆ చరిత్ర ఎక్కడా కూడా ప్రచురణ కాలేదు. మేడారం కోయగిరిజనుల జాతర, వారి జీవన విధానాన్ని, పండుగలను అర్థం చేసుకోకుండా మేడారం జాతరను అర్థం చేసుకోవడం కష్టం అని..

మేడారం జాతర మూలాలపై పరిశోధన ఏది?

  • పట్టించుకోని కేయూ చరిత్ర విభాగం

  • పొరుగు జిల్లాల వర్సిటీల తీరూ అంతే

  • కొంతమేరకు గిరిజన విజ్ఞాన పీఠం అధ్యయనం

హనుమకొండ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క, సారలమ్మ జాతర పూర్వాపరాలపై ఇప్పటివరకు పరిశోధన జరగలేదు. ఆ చరిత్ర ఎక్కడా కూడా ప్రచురణ కాలేదు. మేడారం కోయగిరిజనుల జాతర, వారి జీవన విధానాన్ని, పండుగలను అర్థం చేసుకోకుండా మేడారం జాతరను అర్థం చేసుకోవడం కష్టం అని.. ఆ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై విస్తృత స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉందన్న డిమాండ్‌ అన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. మేడారం జాతర చరిత్రపై విశ్వ విద్యాలయాలు, అధ్యయన కేంద్రాలు, గిరిజన పరిశోధనా సంస్థలు ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించలేదు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగం కూడా పట్టించుకోవడం లేదు. సమ్మక్క, సారలమ్మ ఆనాటి పాలకులైన కాకతీయ రాజులపై సుంకం వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం జరిపారని, ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో మొత్తం మేడరాజు కుటుంబం నేలకొరిగిందని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇదే కథనాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ కోణంలో రెండు దశాబ్దాల కిందట తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం కొంతమేర పరిశోధన చేసింది. మేడారం సమ్మక్క, సాలరమ్మ జాతర పేరుతో ఒక అధ్యయన గ్రంథాన్ని వెలువరించింది. అప్పటికే పలువురు చరిత్రకారులు రాసిన పరిశోధనా గ్రంథాల నుంచి సేకరించిన విషయాలనే ఈ గ్రంథంలో క్రోడీకరించింది. 2000లో భూక్యా చిన వెంకటేశ్వర్లు.. ‘గిరిజన వీరనారీమణులు శ్రీ సమ్మక్క, సారలమ్మ సాహస చరిత్ర’, 2006లో దివిటి అంజనీ దేవి.. ‘సమ్మక్క,. సారలమ్మ జాతర సాహిత్య, సాంస్కృతిక అంశాలు’ అనే గ్రంథాలు జాతరను పరిశోధన కోణంలో వ్యక్తీకరించాయి. ముదిగొండ శివప్రసాద్‌ చంద్రకళ చారిత్రక రచనలో, అలాగే శాయంపేటకు చెందిన తిరునగరి రంగయ్య తమ రచనల ద్వారా జాతర చారిత్రక నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కాగా సమ్మక్క జాతరకు మూలమైన సంపెంగవాగు యుద్ధం జరిగిందని నిర్ధారణ జరిగితే నేటికి ఆ ఘట్టానికి 970 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు లెక్క. ప్రభుత్వ గణాంకాలను బట్టి చూసినా 120 ఏళ్ల నుంచి జాతర జరుగుతున్నట్టు ఆధారాలున్నాయి. 60 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర నిర్వహింపబడుతోంది. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నా జాతరకు సంబంధించి మూలాలపై పరిశోధనల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం లేదా గిరిజన విజ్ఞాన పీఠానికి ఎంతోకొంత నిధులు కేటాయిస్తే పరిశోధన జరిగేందుకు ప్రాతిపదిక ఏర్పడేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మొత్తాన్ని కాకతీయ వర్సిటీకి, లేడా గిరిజన విజ్ఞాన పీఠం వంటి పరిశోధనా సంస్థల వద్ద డిపాజిట్‌ చేసి ఉంటే రెండేళ్లకోసారి జరిగే జాతరపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించేందుకు వీలయ్యేదని అంటున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 03:35 AM