సమ్మక్క- సారక్క జాతర పోయొద్దామా!
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:37 AM
దారులన్నీ మేడారం వైపే! పోదామిక మహాజాతరకు అంటూ భక్తజనం కదులుతోంది. వండుకునేందుకు సరుకులు.. కోళ్లు, గొర్రెలు, వనదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు బెల్లం ముద్దలు, పసుపు, కుంకుమ, ఒడిబియాన్ని....
నేటి నుంచే మహాజాతర.. 4రోజుల పాటు ఉత్సవాలు నేడు కన్నెపల్లి నుంచి గద్దెలపైకి సారలమ్మ జ
వరంగల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దారులన్నీ మేడారం వైపే! పోదామిక మహాజాతరకు అంటూ భక్తజనం కదులుతోంది. వండుకునేందుకు సరుకులు.. కోళ్లు, గొర్రెలు, వనదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు బెల్లం ముద్దలు, పసుపు, కుంకుమ, ఒడిబియాన్ని ఎడ్ల బండ్లు, ఆటోల్లో వేసుకొని ‘జై సమ్మక్క-జై జై సారలమ్మ’ అంటూ పిల్లాజెల్లాను వెంట బెట్టుకొని బయలుదేరింది. రాష్ట్రం నలువైపుల నుంచే కాదు.. పొరుగున ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలుతున్నారు. మేడారం మహాజాతర మొదలయ్యేది బుధవారమే. ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తనుంది. గద్దెల ఆధునికీకరణ, ప్రాకారాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి అభివృద్ధి, ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపట్టి పూర్తిచేయడంతో మహాజాతర ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. ఇప్పటికే భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. కాగా వనదేవతల్లో ఒకరైన సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజులు రాకతో మహాజాతరకు తెరలేవనుంది. ఇందుకు సారక్క కొలువుదీరిన కన్నెపల్లి ముస్తాబైంది. బుధవారం ఉదయం అక్కడ సారలమ్మ ఆలయాన్ని ప్రధాన పూజారి కాక సారయ్య, మిగతా పూజారులు శుద్ధిచేసి అలంకరిస్తారు. సాయంత్రం ఆలయంలో పూజారులు రహస్య పూజలు జరుపుతారు. అనంతరం ఆలయం నుంచి గద్దెలవైపు పూజారులు సారలమ్మను తీసుకొస్తారు. కన్నెపల్లిలోని ప్రతి గడప సారలమ్మకు స్వాగతం పలుకుతుంది.
వీధిలోని తమ ఇళ్ల ముందుకు రాగానే పూజారులు పీటలు వేసి.. కాళ్లు కడిగి, మంగళహారతులిచ్చి తల్లిని సాగనంపుతారు. ఆ తల్లి కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్నవాగు దాటి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటుంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు, మరిది గోవిందరాజులు కుడా గద్దెలపైకి బుధవారమే చేరుకుంటారు. ఈ మేరకు మంగళవారమే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు బయలుదేరారు. పూజారి పెనుక బుచ్చిరాములు ఆధ్వర్యంలో ఆదివాసీలు కాలి నడకన పగిడిద్ద రాజును పడిగే రూపంలో తీసుకోని బుధవారం సాయంత్రానికి మేడారంలో సమ్మక్క గుడికి చేరుకుంటారు. గోవిందరాజులు కూడా బుధవారమే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి పడిగే రూపంలో బయలుదేరుతారు. పూజారి దబ్బకట్ల గోవర్ధన్ గోవిందరాజుల పడిగెను ఎత్తుకొని మేడారంలోని సమ్మక్క ఆలయం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలందుకున్న అనంతరం ముగ్గురు వనదేవతలు గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తనయుడు జంపన్న గద్దెలపైకి చేరుకున్నారు.
200 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా...
మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తిచేసింది. జాతర కోసం రూ.251 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.150 కోట్లు జాతరలో భక్తులకు మౌలిక వసతులకు, రూ.90 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం విస్తరణకు కేటాయించారు. మరో రూ.11 కోట్ల నిధులను అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, గద్దెల నుంచి జంపన్నవాగు దాకా రోడ్డు విస్తరణకు కేటాయించారు. గద్దెలు, ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో ఆధునికీకరించారు. 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా శిలలపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిసేలా శిల్పాలు చెక్కారు. వనదేవతల గద్దెలను ఒకే వరుసలో నిర్మించారు. జాతర కోసం ప్రభుత్వం 21 శాఖలకు చెందిన 42,027 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. 13వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు తప్పిపోకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన రిస్ట్‌బ్యాండ్‌లను అందుబాటులోకి తెచ్చారు. జాతరలో 450 సీసీ కెమెరాలు, 20 డిస్‌ప్లే ప్యానల్స్ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ 4వేల బస్సులను జారతకు సిద్ధం చేసింది. జాతరలో 5,500 తాత్కాలిక నల్లాలు, 5,700 టాయిలెట్లు నిర్మించారు. 5వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. జాతర సమాచారం కోసం తొలిసారి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 7658912300 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన రూట్ మ్యాప్, ట్రాఫిక్ తదితర పూర్తి వివరాలు అందిస్తారు.