Share News

మహాజాతరలో ఆగ్రహ జ్వాల!

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:39 AM

తల్లుల నుంచి చల్లని ఆశీస్సులు తీసుకొని ఆ ఆనంద పారవశ్యంతో తిరుగు ప్రయాణమైన భక్తుల్లో కొద్దిసేపటికే ఆగ్రహం పెల్లుబికింది! ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.

మహాజాతరలో ఆగ్రహ జ్వాల!

  • బస్టాండ్‌ నుంచి కదలని బస్సులు.. రద్దీ క్యూలైన్లు

  • మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి దాకా అవస్థ

  • తాగేందుకు మంచినీళ్లూ దొరకని దైన్యం

  • సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు

మేడారం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): తల్లుల నుంచి చల్లని ఆశీస్సులు తీసుకొని ఆ ఆనంద పారవశ్యంతో తిరుగు ప్రయాణమైన భక్తుల్లో కొద్దిసేపటికే ఆగ్రహం పెల్లుబికింది! ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌తో కదలని వాహనాలు! ఫలితంగా బస్టాండ్‌లో బస్సెక్కి గంటలు గడుస్తున్నా అక్కడి నుంచి వాహనం కదలని పరిస్థితి!! బస్టాండ్‌లో ఉన్నవారికేమో కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేదు. క్యూలైన్లలోనూ అంతే. అడుగుతీసి అడుగు పెట్టలేనంత రద్దీ! మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటలైనా పరిస్థితి ఏమీ మారలేదు. క్యూలైన్లలోని భక్తుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. తాగడానికి కనీసం మంచినీళ్లు లేక గంటల తరబడి చిన్నారులు ఎలా తట్టుకోగలరు? తమ పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుండటం.. వృద్ధులు ఆయాసపడుతుండటం చూసి భక్తులు కన్నెర్ర చేశారు! ఆగ్రహం పట్టలేక ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడ్డారు. బస్సుల అద్దాలు పగులగొట్టారు. మీరు చేసిన ఏర్పాట్లు ఇవేనా? అధికారులు ఎక్కడ? అంటూ నినాదాలు చేశారు. మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి వెంటనే బస్టాండ్‌కు రావాలని డిమాండ్‌ చేశారు. రెండ్రోజులుగా ప్రశాంతంగా జరిగిన మేడారం మహాజాతరలో మూడోరోజు శుక్రవారం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన భక్తులు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ఊహించని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడం.. రద్దీ కారణంగా ట్రాఫిక్‌ జాంతో వచ్చేదారులు.. వెళ్లేదారులు స్తంభించిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. పైపెచ్చు.. తిరుగు ప్రయాణమైన భక్తులంతా బస్టాండ్‌కు చేరుకోవడంతో మేడారం జాతరంతా ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న బస్టాండ్‌కు తరలిందా? అన్నంత రద్దీ అక్కడ నెలకొంది. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారులు బస్టాండ్‌లో కనిపిస్తే ఒట్టు! ప్రయాణికుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు చూసి జడుసుకొని కనిపించకుండా పోయారు. గంటలకొద్దీ నిరీక్షిస్తుండటంతో చార్జింగ్‌ అయిపోయి.. ఫోన్లు పనిచేయలేదు. ఫలితంగా తమ క్షేమ సమాచారాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు తెలియచేసే అవకాశం కూడా లేకుండా పోయిందన్న ఆవేదన భక్తుల్లో కోపంగా మారింది. ఆకలి, చలికి తట్టుకోలేక.. ఆ బస్సులేమో కదలక.. ఎప్పుడు కదలతాయో.. ఎవర్ని అడగాలో తెలియని దిక్కుతోచని స్థితిలో భక్తులు బస్సులపై దాడులకు పాల్పడ్డారు. అరుపులు, కేకలతో అంతా గందరగోళం నెలకొంది.


భక్తులంతా బస్టాండ్‌లోనే..

సమ్మక్క తల్లిని దర్శించుకున్న అనంతరం భక్తులు గురువారం అర్ధరాత్రి నుంచే తిరుగుబాట పట్టారు. శుక్రవారం ఉదయానికి జాతరలోని సగం మంది బస్టాండ్‌కు చేరుకున్నారు. కాగా, ఎన్నడూ లేనిది ఈసారి సమ్మక్కను దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. సాధారణంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లించిన భక్తులు ఆ వెంటనే తిరుగు ప్రయాణం అవుతారు. శుక్రవారం సాయంత్రానికి జాతరలో జనం పలుచపడ్డారు. కానీ, ఈసారి ఇందుకు విరుద్ధంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మేడారానికి ప్రవాహంలా తరలివచ్చారు. దర్శనం అనంతరం తిరుగుబాట పట్టిన భక్తులతో బస్టాండ్‌ కిక్కిరిసి పోయింది.

2.jpg

మేడారం-తాడ్వాయి మధ్య ట్రాఫిక్‌ జామ్‌

బస్సుల రాకపోకలు శుక్రవారం ఉదయం వరకు సాఫీగానే సాగినా.. ఆ తర్వాత ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. బస్టాండ్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేకంగా గద్దెల వరకు కొత్త రోడ్డును నిర్మించారు. ఈ సారి వీవీఐపీలు, వీఐపీలకు పాస్‌లను ఎక్కువగా జారీ చేశారు. విచ్చలవిడిగా జారీ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ పాస్‌లను తీసుకొని ప్రైవేటు వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీలు కాని వారికి కూడా పాస్‌లు ఇవ్వడం వల్ల వీరిలో పలువురు ట్రాక్టర్లపై మేడారానికి బయలు దేరారు. వీఐపీ పాస్‌లున్న వారిని ముందుగా పంపడానికి వీలుగా బస్సులను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ప్రైవేటు వాహనాలను కూడా ఈ బైపాస్‌ రోడ్డు గుండా మళ్లించడంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. బస్సులో ఉన్న ప్రయాణికులతో పాటు బస్టాండ్‌కు చేరిన వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. త్వరలోనే ట్రాఫిక్‌ క్లియర్‌ అవుతుందని, బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా, చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడమే కాక కొన్ని బస్సులు సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. దీనితో మిగతా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నా మేడారానికి భక్తుల రాక అధికంగా ఉండడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.

Updated Date - Jan 31 , 2026 | 04:39 AM