జాతర ముగిసె.. రైతులకు కష్టాలు మిగిలే!
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:39 AM
మేడారం జాతర కోలాహలం ముగిసింది. అయితే జాతర సందర్భంగా భక్తులు వదిలేసిన గాజు సీసాలు ముక్కలై పొలాల్లో చెల్లాచెదురుగా పడి రైతుల కాళ్లకు గాయాలు చేస్తున్నాయి...
మేడారం పొలాల్లో గాజు సీసాల ముక్కలు, ప్లాస్టిక్ కవర్లు
జాతర వేళ 500 ఎకరాల్లో యాసంగి పంట బంద్
ప్రభుత్వం పరిహారం ఇవ్వటం లేదంటున్న రైతులు
వరంగల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడారం జాతర కోలాహలం ముగిసింది. అయితే జాతర సందర్భంగా భక్తులు వదిలేసిన గాజు సీసాలు ముక్కలై పొలాల్లో చెల్లాచెదురుగా పడి రైతుల కాళ్లకు గాయాలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, థర్మాకోల్ ప్లేట్లు పొలాల్లో పేరుకుపోయి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆహారంగా భావించి వాటిని మింగిన పశువుల కడుపుల్లోకి చేరి అనారోగ్యానికి గురవుతున్నాయి. జాతర సమయంలో సుమారు 500 ఎకరాల్లో యాసంగి పంటలు వేయకుండా అడ్డుకునే అధికార యం త్రాంగం.. పరిహారం ఇవ్వడంలో శ్రద్ధ పెట్టడం లేదని రైతులు వా పోతున్నారు. ఈసారి జాతరకు సుమారు కోటిన్నర మంది భక్తులు వచ్చారు. మేడారం పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో 5 వేల మంది పారిశుధ్య కార్మికులు రాత్రింబవళ్లు పని చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. 4 రోజుల్లోనే మూడున్నర వేల టన్నులకుపైగా చెత్త పోగైనట్లు అధికారుల అంచనా. ఇందులో 1,500 టన్నులు ప్లాస్టిక్, 500 టన్నులకు పైగా జంతు వ్యర్థా లున్నాయి. మరో 1,500 టన్నుల చెత్తలో భూమిలో తేలికగా కలిసిపోయే బియ్యం, బెల్లం, కొబ్బరి, ఆహారవ్యర్థాలు తదితరాలు న్నాయి. 52ు భూమిలో కలిసిపోయే చెత్త ఉండగా, గాజు, ప్లాస్టిక్ 48ు వరకు ఉంది.
రైతు జీవితాలపై జాతర గాయాలు
మేడారం చుట్టుపక్కల సుమారు 5 వేల ఎకరాల్లో భక్తులు అడవులు, పొలాల గట్టు, చెట్ల కింద విడిదిచేశారు. మొక్కుల చెల్లింపు తర్వాత మద్యం, మాంసంతో విందు చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వేలాది మద్యం సీసాలు పొలా లు, అడవుల్లో తాగి పడేసిపోయారు. జాతరలో పోగవుతున్న వ్యర్థాల్లో సుమారు 100 టన్నులకు పైగా సీసాల వ్యర్థాలే ఉన్నట్లుగా సిబ్బంది లెక్కలు వేస్తున్నారు. మేడారం పరిసర ప్రాంత రైతులు పగిలిపోయిన గాజు ముక్కలను ఒక్కొక్కటిగా ఏరుతున్నారు. వానాకాలం పంటల నాటికి గాజు ముక్కలను ఏరి పారేయకుంటే తమతో పాటు పశువుల కాళ్లకు గుచ్చుకొని గాయాలవడం ఖాయమ ని చెబుతున్నారు. సీసా ముక్కలు కాళ్లకు గుచ్చుకుని నెలల తరబడి అస్పత్రుల చు ట్టూ తిరిగిన సందర్భాలున్నాయని చెప్పారు. ఇటు పార్కింగ్ కోసం వందలాది ఎకరాల్లో పొలాల గట్లను చెదరగొట్టారు. జాతర పూర్తయిన తర్వాత తిరిగి ఎవరి పొలం వరకు వారి గట్లను పునరుద్ధరించకుండా వదిలేసివెళ్లారు. దీంతో గట్లను పునరుద్ధరించే సమయంలో రైతుల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయని వాపోతున్నారు. వీటితో పాటు జాతరలో తాత్కాలికంగా 5 వేల మరుగుదొడ్లను పొలాల్లోనే ఏర్పాటుచేశారు. జాతర అయ్యాక అసంపూర్తిగా గుంత లు పూడ్చి వెళ్తుండడంతో పొలం దున్నే క్రమంలో ట్రాక్టర్లు దిగబడి పోతున్నాయని చెబుతున్నారు. ఇక జాతర జరిగే ఏడాది యాసంగి పంటలు వేయకుండా అధికారుల ఆంక్షలున్నాయని.. వాటికి సం బంధించిన నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.