బాసర టూ భద్రాచలం..గోదావరి పరీవాహక గుడులన్నీ అభివృద్ధి
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:23 AM
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రంలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు..
మేడారం మాస్టర్ ప్లాన్ సిద్ధం
జంపన్న వాగులో నిత్యం రామప్ప నీళ్లు
జాతర భక్తులకు సకల సౌకర్యాలు
కావాలని చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క
మేడారం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రంలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. రూ.250 కోట్ల నిధులతో వాటి అభివృద్ధికి మేడారంలోనే జరిగిన క్యాబినెట్ సమావేశం తీర్మానించిందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాను తలపించేలా మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారన్నారు. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లన్నీ చేశామని, కావాలని చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. ఇప్పటికే సుమారు 80 లక్షల మేర వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారని తెలిపారు. మేడారం జాతరకు కేంద్రం అంతంత మాత్రంగా మాత్రమే నిధులు కేటాయించిందని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రూ.3.26 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని చెప్పారని, జాతరకు జాతీయ హోదా కల్పించాలంటే ఆయన స్పందించలేదని పొంగులేటి వెల్లడించారు. కాగా, మేడారం జాతర మాస్టర్‌ప్లాన్ సిద్ధమైందని, త్వరలోనే శాశ్వత నిర్మాణాలు చేపడుతామన్నారు. ఇందు కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించగా, మరో 42 ఎకరాలు సేకరిస్తామని పొంగులేటి తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, ఏకో పార్కుతోపాటు శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్లు, మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. రామప్ప నుంచి లక్నవరం.. లక్నవరం నుంచి జంపన్న వాగులోకి నీటిని మళ్లిస్తామన్న మంత్రి పొంగులేటి.. 365 రోజులు జంపన్న వాగులో నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్ అప్పగించిన బాధ్యతను మంత్రి సీనన్న సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. రోడ్లను వెడల్పు చేయడంతో జాతర పరిసర ప్రాంతాలు విశాలంగా మారాయని, దీంతో ఇబ్బందుల్లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారని చెప్పారు.