Share News

Medaram Jatara: మేడారం మన గుండెచప్పుడు

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:53 AM

ఆదివాసీల సంప్రదాయాలే విశ్వాసంగా సాగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

Medaram Jatara: మేడారం మన గుండెచప్పుడు

  • సమ్మక్క- సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం

  • జాతరలో భక్తులకు అసౌకర్యంకలగకుండా శాశ్వత నిర్మాణాలు

  • మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల,సురేఖ, సీతక్క, అడ్లూరిలతోకలిసి మేడారంలో భట్టి సమీక్ష

ములుగు/ తాడ్వాయి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సంప్రదాయాలే విశ్వాసంగా సాగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ములుగు జిల్లా మేడారం దేవస్థానం అభివృద్ధితోపాటు జంపన్న వాగు, ఆర్టీసీ, కూడళ్ల సుందరీకరణ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. అనంతరం హరిత హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మేడారం జాతర అని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బ తినకుండా దేవస్థాన సన్నిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్న విక్రమార్క.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్‌, కలెక్టర్‌ దివాకర, ఎస్పీ సుదీర్‌రాంనాథ్‌ కేకన్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, మేడారంలో ముందుగానే జాతర సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది భక్తులు వన దేవతలను సందర్శించి ముందస్తు మొక్కులు చెల్లించారు. ఈ నెల 28-31 మధ్య జరిగే మహా జాతర ముందే కనిపించిందని అధికారులు పేర్కొనడం గమనార్హం.


భక్తులు కళ్యాణ కట్టల వద్ద తలనీలాలు సమర్పించుకుని జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. శివ సత్తుల పూనకాలు, డోలీ వాయిద్యాల చప్పుళ్ల మధ్య భక్తి శ్రద్ధలతో ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల మధ్య గద్దెలకు చేరుకుని తల్లులకు పసుపు, కుంకుమ, చీర సారె, బంగారం (బెల్లం), కొబ్బరి కాయలు, యాట మొక్కులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తుల రాకతో గంటల పాటు గద్దెల పరిసరాలు, దేవస్థాన ప్రాంగణం రద్దీగా మారింది. మరోవైపు పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు వాహనాలను పార్కింగ్‌ ప్రదేశాలకు తరలించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఊరట్టం క్రాస్‌ నుంచే వాహనాలను పార్కింగ్‌కు తరలించడంతో జంపన్న వాగు నుంచి భక్తులు ఆటోల్లోనూ, కాలినడకన దేవస్థానానికి తరలి వెళ్లారు.

Updated Date - Jan 12 , 2026 | 03:54 AM