మేడారంలో పిల్లలు తప్పిపోతే ఇట్టే కనిపెట్టొచ్చు!
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:08 AM
మేడారం మహా జాతర.. ఆ రద్దీలో పిల్లలు తప్పిపోతే? తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు, వివరాలు చెప్పే పరిణతి కూడా చిన్నారులకు లేకపోతే..
జాతరలో చిన్నారుల భద్రత కోసం క్యూఆర్ కోడ్ రిస్ట్‌బ్యాండ్లు
అందుబాటులోకి ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టం’
జాతరలో 11 పాయింట్ల వద్ద చిన్నారుల వివరాలు నమోదు
తప్పిపోతే రిస్ట్‌బ్యాండ్ స్కాన్ చేసి కన్నవారి చెంతకు చేర్చనున్న వలంటీర్లు
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర.. ఆ రద్దీలో పిల్లలు తప్పిపోతే? తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు, వివరాలు చెప్పే పరిణతి కూడా చిన్నారులకు లేకపోతే? ఆచూకీ రాబట్టడం ఎంత కష్టం? తల్లిదండ్రులకు ఈ టెన్షన్లేవీ లేకుండా జాతరలో పిల్లల భద్రత కోసం ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీటీఎం్‌స)’ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక విధానం ప్రకారం జాతరకొచ్చే భక్తుల వెంట ఉన్న చిన్నారుల వివరాలను నిర్దేశించిన 11 ప్రత్యేక పాయింట్ల వద్ద సిబ్బంది నమోదు చేసుకుంటారు. ఆ వివరాల్లో చిన్నారులు, తల్లిదండ్రులు లేదా సంరక్షుల పేర్లు, ఫోన్ నంబర్లు కంప్యూటర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత క్యూఆర్ కోడ్‌తో కూడిన రిస్ట్‌బ్యాండ్లను చిన్నారులకు చుడతారు. ఒకవేళ జాతరలో పిల్లలు తప్పిపోయి వలంటీర్లు, పోలీసుల కంటపడితే వారు.. చిన్నారుల చేతికి ఉన్న క్యూఆర్ కోడ్‌ను తమ ఫోన్‌తో స్కాన్ చేస్తారు. ఆ వెంటనే తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. ఆ సమాచారంతో వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పిల్లలను వారి చెంతకు చేరుస్తారు. ఈ మేరకు జాతర కోసం తొలిదశలో 25వేల రిస్ట్‌బ్యాండ్లు సిద్ధంగా ఉంచారు. వోడాఫోన్ ఐడియా సహకారంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ సుమతి నెలన్నర పాటు శ్రమించి ఈ క్యూఆర్ కోడ్‌ను రూపొదించారు. శనివారం తన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి.. సీటీఎంఎస్ రిస్ట్‌బ్యాండ్లను, పోస్టర్లను ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఆయనే వెల్లడించారు. మహిళా భద్రతా విభాగం డీజీపీ చారుసిన్హా ఆధ్వర్యంలో మేడారం జాతరలో పూర్తి స్ధాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తులో జరిగే కుంభమేళాలో ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేశ్ భగవత్, చారుసిన్హా, డీఎస్ చౌహన్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, సుమతి, డాక్టర్ గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.