Share News

చిన్నారి చేతికి కారు కీ.. ఏడేళ్ల బాలుడి బలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:40 AM

ఒక తండ్రి నిర్లక్ష్యం మరో తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. నాలుగున్నరేళ్ల బాలుడి చేతికి కారు తాళంచెవి ఇవ్వడం ఘోర విషాదానికి దారితీసింది.

చిన్నారి చేతికి కారు కీ.. ఏడేళ్ల బాలుడి బలి

  • అనుకోకుండా స్టార్ట్‌ అయిన కారు

  • ఆడుకుంటున్న బాలుడిపై దూసుకెళ్లిన వైనం

  • ములుగు జిల్లా మేడారంలో విషాదం

తాడ్వాయి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఒక తండ్రి నిర్లక్ష్యం మరో తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. నాలుగున్నరేళ్ల బాలుడి చేతికి కారు తాళంచెవి ఇవ్వడం ఘోర విషాదానికి దారితీసింది. ఆ చిన్నారి అనుకోకుండా కారు స్టార్‌ చేయడంతో.. అక్కడే ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడు విలవిల్లాడుతూ అక్కడే ప్రాణం విడిచాడు. అప్పటి వరకు సందడిగా ఆడుకుంటున్న తమ కుమారుడు కారు కింద నలిగిపోవడం చూసి ఆ తల్లిదండ్రుల గుండె పగిలినంత పనైంది. ఈ విషాధ ఘటన శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన అలిమేఖల పురుషోత్తం కుటుంబం సమ్మక్క, సారక్క దర్శనం కోసం మేడారం వెళ్లింది. వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్‌ కుటుంబం కూడా వనదేవతల దర్శనం కోసం మేడారం చేరుకుంది. వనదేవతలకు మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆ కుటుంబాలు పక్కపక్కనే ఉన్న ప్రైవేటు వసతి గృహల్లో విడిది చేశాయి. ఈ క్రమంలో అరుణ్‌ కుమారుడు తన తండ్రి నుంచి కారు తాళం చెవి తీసుకుని, కారు స్టార్ట్‌ చేశాడు. అదే ఆవరణలో ఆరుబయట ఆడుకుంటున్న పురుషోత్తం కుమారుడు కౌషిక్‌ (7)పై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అరుణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కమలాకర్‌ తెలిపారు. మృతుడు కౌషిక్‌ రెండో తరగతి చదువుతుండగా, అతడి మృతికి కారకుడైన బాలుడు యూకేజీలో ఉన్నాడు. ములుగు ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహ్నాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - Jul 04 , 2026 | 06:42 AM