తెలుగు మాస్టారి కీచకావతారం!
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:27 AM
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వారి పాలిట కీచకుడిగా మారాడు. తరగతి గదిలో బాలికలతో ద్వంద్వార్థపు మాటలు మాట్లాడుతూ, వారిని అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన
ద్వంద్వార్థపు మాటలు.. వెకిలి చేష్టలు
మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీహెచ్‌ఎస్‌లో ఘటన
ఉపాధ్యాయుడిపై 1098కు ఫిర్యాదు
మహిళా, శిశు సంక్షేమ అధికారుల విచారణ
మెదక్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వారి పాలిట కీచకుడిగా మారాడు. తరగతి గదిలో బాలికలతో ద్వంద్వార్థపు మాటలు మాట్లాడుతూ, వారిని అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వెకిలి చేష్టలకు పాల్పడుతూ విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పదే పదే అతడు అలాగే ప్రవర్తిస్తుండడంతో భరించలేకపోయిన బాలికలు చివరకు పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులకు చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు. వారి సహాయంతో బాలల హెల్ప్‌లైన్ 1098కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దాదాపు 20 రోజుల క్రితమే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినా.. బాలికలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. అయితే బాలల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు పలు దఫాలుగా వివరాలు సేకరించినట్లు సమాచారం.
విచారణ జరిపిన డీడబ్ల్యూవో..
విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పాపన్నపేట జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి విచారణ జరిపినట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి (డీడబ్ల్యూవో) హేమభార్గవి తెలిపారు. బాలికలతోపాటు ఇతర ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితోనూ మాట్లాడి వివరాలు రాబట్టామని చెప్పారు. పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు మరోసారి సీడీపీవోను పంపినట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విచారణలో బాలికలు ఏం చెప్పారన్నది మాత్రం వెల్లడించలేదు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. అయితే పాఠశాలలో జరిగినట్లు చెబుతున్న ఈ వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థినులు చేసిన ఆరోపణలు అత్యంత సున్నితమైనవి కావడంతో ఎలాంటి పక్షపాతం, ఒత్తిళ్లకు తావు లేకుండా సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.