Share News

మెదక్‌లో మెరిసేదెవరో?

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:17 AM

రెండు దశాబ్దాల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెతుకు సీమలో మునిసిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏ మునిసిపాలిటీపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మెదక్‌లో మెరిసేదెవరో?

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రసవత్తరంగా మునిసిపల్‌ పోరు

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ

  • 19 మునిసిపాలిటీల్లో 403 వార్డులకు ఎన్నికలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండు దశాబ్దాల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెతుకు సీమలో మునిసిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏ మునిసిపాలిటీపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 20 మునిసిపాలిటీలు ఉండగా, సిద్దిపేట మినహా 19 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిచోట్లా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. కొన్నిచోట్ల ఎంఐఎం కూడా ప్రభావం చూపుతోంది. అన్ని పార్టీల ముఖ్యనేతలు 10 రోజులపాటు జోరుగా ప్రచారం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలను బీఆర్‌ఎస్‌ పార్టీ గెల్చుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. మెదక్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ, జహీరాబాద్‌ను కాంగ్రెస్‌ దక్కించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలనూ బీజేపీయే గెలిచింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో నిలిచింది. దీంతో మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయోననే ఆసక్తి నెలకొంది. పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో డబ్బు ఏరులై పారుతోంది. ముఖ్యంగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల తదితర మునిసిపాలిటీల్లో అభ్యర్థులు పోటీపడి డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇస్నాపూర్‌లోని పలు వార్డుల్లో ఓటుకు రూ.10 వేలకు పైగానే పంచుతున్నట్లు చెబుతున్నారు.


ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకం..

ఈ ఎన్నికలను అన్ని పార్టీల కీలక నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంతోపాటు తూప్రాన్‌ పట్టణంపై కాంగ్రెస్‌, బీజేపీ దృష్టి పెట్టాయి. సంగారెడ్డి, సదాశివపేట మునిసిపాలిటీల్లో గెలుపును టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఛాలెంజ్‌గా తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌-జోగిపేటపైన, మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌పైదృష్టి పెట్టారు. మెదక్‌, రామాయంపేట మునిసిపాలిటీలను మెదక్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఆయన తండ్రి మైనంపల్లి హన్మంతరావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కోహీర్‌లో తన పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌షెట్కార్‌ కష్టపడుతున్నారు. నర్సాపూర్‌, చేర్యాల, దుబ్బాకల్లో మంత్రులు అజారుద్దీన్‌, వివేక్‌ వెంకటస్వామి మకాం వేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నీతానే అయ్యి ప్రచారం చేశారు. బీజేపీ తరఫున మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్ని మునిసిపాలిటీల బాధ్యతలు తీసుకున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, కమ్యూనిస్టులు ఎవరికివారే అభ్యర్థులను బరిలోకి దించారు. చేర్యాలలో మాత్రం ఒక వార్డును సీపీఎంకు అప్పగించి బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంది. మెదక్‌ మునిసిపాలిటీలో ఒక స్థానం ఏకగ్రీవమై కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. ఇక 403 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పలుచోట్ల ఏ పార్టీకి కూడా చైర్మన్‌ పదవిని దక్కించుకోగలిగే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో పొత్తులే కీలకం కానున్నాయి. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల పంపకాల ఆధారంగా పొత్తులు ఉంటాయని అంటున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 04:17 AM