Share News

Medaaram Maha Jatara to Begin: 29న సాయంత్రం 5 గంటలకు గద్దెపైకి సమ్మక్క

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:50 AM

మేడారం మహా జాతర మహాఘట్టం జనవరి 29న (గురువారం) సాయంత్రం 5 గంటలకు ఆవిష్కృతం కానుంది. ఆ రోజున వనం నుంచి సమ్మక్క గద్దెపైకి రానుంది.

Medaaram Maha Jatara to Begin: 29న సాయంత్రం  5 గంటలకు గద్దెపైకి సమ్మక్క

  • 31న దేవతల వన ప్రవేశం...29న మొక్కుల చెల్లింపులు

  • 19న ఆలయ పునరుద్ధరణ పనులను

  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర మహాఘట్టం జనవరి 29న (గురువారం) సాయంత్రం 5 గంటలకు ఆవిష్కృతం కానుంది. ఆ రోజున వనం నుంచి సమ్మక్క గద్దెపైకి రానుంది. అంతకుముందుగా 28న బుధవారం సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెపైకి రానుంది. ఆ తరువాత 29 సాయంత్రం 5 గంటల నుంచి 31 సాయంత్రం 4 గంటల వరకు మొక్కులు చెల్లించే కార్యక్రమం జరుగనుంది. 31న సాయంత్రం సమ్మక్క-సారలమ్మలు వన ప్రవేశం చేయనున్నారు. కాగా ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆహ్వానపత్రికలోనూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ మహాజాతర ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో మేడారం ఈవో వీరస్వామి, ఆలయ పూజరుల సంఘం అఽధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు. కాగా, ఆలయ సంప్రదాయం ప్రకారం సీఎంకు కంకణం కట్టి.. కండువా కప్పి, బంగారం అందజేసి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసా ద్‌కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు జాతరకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రికలను అందించారు. కాగా, మేడారం పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. కుంభ మేళాను తలపించేలా మేడారంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ‘మరో 200 ఏళ్లు నిలిచేలా మేడారంలో గిరిజన సంస్కృతి-సంప్రదాయాలకు అనుగుణంగా రూ.200కోట్ల వ్యయంతో రాతి కట్టడాలను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మేడారం చుట్టపక్కల 10 కిమీ. మేర నాలుగు లైన్‌ల రోడ్లు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.

Updated Date - Jan 06 , 2026 | 01:50 AM