Share News

Medaaram Jatara: మేడారం జాతరకు ప్రత్యేక లోగో

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:15 AM

సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త హంగులతో వైభవంగా జరగనుంది. గద్దెల ప్రాంగణం, జంపన్నవాగుతోపాటు జాతర జరిగే ప్రాంతం మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.

Medaaram Jatara: మేడారం జాతరకు ప్రత్యేక లోగో

  • విభిన్నంగా శిలాఫలకం.. ఓ వైపు స్థల పురాణం మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు

  • గద్దెల ప్రాంగణాల్లో విద్యుద్దీపాల అలంకరణ

  • 12 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు

  • 18న మేడారానికి సీఎం రేవంత్‌.. అక్కడే బస

  • 19న ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం

  • మొక్కులు చెల్లించిన తర్వాత దావో్‌సకు..

  • మేడారానికి ఆదివారం 2 లక్షల మంది భక్తులు

  • మంత్రి సీతక్కతో కలిసి వన దేవతలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

  • జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌/తాడ్వాయి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త హంగులతో వైభవంగా జరగనుంది. గద్దెల ప్రాంగణం, జంపన్నవాగుతోపాటు జాతర జరిగే ప్రాంతం మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అభివృద్ధి పనుల్లో 95 శాతం పనులు జరిగాయని, ఈ నెల 12 నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. జాతర కోసం ప్రత్యేకంగా లోగోను రూపొందించారు. గద్దెల నుంచి చిలుకలగుట్టకు వెళ్లే మార్గంలో కుడివైపు ప్రత్యేకంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. లోగో, శిలాఫలకం, రాత్రి సమయంలో ప్రాంగణం కనిపించే తీరుపై ప్రభుత్వం రూపొందించిన నమూనా చిత్రాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. వాటి ప్రకారం..

లోగో, శిలా ఫలకం, ఇతర ఏర్పాట్లు ఇలా..

  • ‘సమ్మక్క-సారలమ్మ జాతర- మేడారం’ పేరు ఉన్న ఈ లోగో వెనుకభాగంలో పచ్చదనానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు, దానిపై ప్రధాన ద్వారాన్ని తలపించేలా తోరణం.. మధ్యలో తల్లుల గద్దెను ఏర్పాటు చేశారు.

  • గద్దెల నుంచి చిలుకలగుట్టకు వెళ్లే ప్రధాన మార్గానికి కుడివైపున భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై ఒకవైపు స్థల పురాణం, మరోవైపు సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించే వివరాలను ఉంచనున్నారు. ఇందుకోసం రెండు, మూడు డిజైన్లను పరిశీలించారు. అందులో ఈ డిజైన్‌కు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

  • గద్దెల ప్రాంగణమంతా ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రధాన ద్వారాన్ని మరింత ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. రాత్రిపూట గద్దెల ప్రాంగణం, ద్వారాలు, ప్రాకారాలు కాంతులతో మెరిసిపోనున్నాయి.

  • 19న సీఎం చేతుల మీదుగా ప్రారంభం

  • పునర్నిర్మాణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సీఎం 18వ తేదీనే మేడారానికి చేరుకుని బస చేస్తారు. 19న ప్రారంభోత్సవం చేసి, సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, దావోస్‌ సదస్సు కోసం వెళ్లనున్నారు. అయితే సీఎం దావో్‌సకు వెళ్లనున్న నేపథ్యంలో.. ప్రారంభోత్సవాన్ని ఒకరోజు ముందే చేసే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.


మేడారంలో ముందస్తు మొక్కులు.. 2 లక్షల మంది రాక

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తుతున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారాంతపు సెలవు నేపథ్యంలో ఆదివారం తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీనితో జంపన్నవాగు వద్ద, అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో తీవ్ర రద్దీ కనిపించింది. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులు జరుగుతుండటం, నిర్మాణ పనుల సామగ్రి, వాహనాలు, యంత్రాలు ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, జాతర సంప్రదాయంలో భాగంగా వనం పోతురాజు ఆధ్వర్యంలో పూజారులు వనంలోకి వెళ్లి సమ్మక్క దేవతను గద్దె వద్దకు తీసుకొస్తారు. ఈ ఘట్టంలో వనం పోతురాజుకు ప్రాముఖ్యత ఉండడంతో.. ప్రత్యేకంగా గద్దె ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆదివాసీ పూజారులు తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 03:15 AM