kumaram bheem asifabad- మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:51 PM
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు నేడు వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికంగా ఎదిగి అదర్శంగా నిలుస్తున్నారన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): , మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు నేడు వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికంగా ఎదిగి అదర్శంగా నిలుస్తున్నారన్నారు. కుట్టు మిషన్లు ఎంబ్రయిడారి మిషన్ల ద్వారా తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా జిల్లాలో సుమారు 80వేలమంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను కుట్టే కార్యక్రమాన్ని అప్పగించామని వివరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అదనపు ఆదాయం పొందేలా వ్యాపార రంగాలలో రాణించాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ మంగ, డీఆర్‌డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): రీచ్ అవుట్ అండ్ రీచ్ ఆల్ అనే నినాదానికి అనుగుణంగా చదువుకు దూరమైన ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చిదిద్దడమే తెలంగాణ ఓపెన్‌స్కూల్ లక్ష్యమని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం తెలంగాణ ఒపెన్‌స్కూల్ 2026-27 ప్రవేశాల పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, ఇతర కారణాలతో చదువు కొనసాగింపలేకపోయిన ప్రతీ ఒక్కరు ఓపెన్‌స్కూల్‌ను సద్వినియోగం చేసుకొని తమ విద్యను పూర్తి చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యను పూర్తి చేయలనుకునే ఆర్హులైన అభ్యర్థులు ఒపెన్‌స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించి నిర్ణీత గడువులోగా ప్రవేశాలు పొందాలని సూచించారు. ప్రవేశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానందచారి, పరీక్షల సహాయ కమిషనర్ జన్నార్దన్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, కో అర్డినేటర్ అబ్దుల్ లతీఫ్, ఓపెన్‌స్కూల్ కో అర్డినేటర్లు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన నషాముఖ్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలంటే మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత అన్నారు. రాష్ట్రంలో నషాముఖ్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. ఇందు కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థులచే మత్తు పదార్థాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట్, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): సర్ సవరణ ప్రక్రియలో భాగంగా ఎనూ్యుమరేషన్ ఫారాలను అనమలిస్ జాబితాలో వివరాలను సరిచేసేందుకు రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలలో పొరపాట్ల సవరణలకు అవకాశం ఉందని చెప్పారు. ఇంటిపేరు, వయస్సు వంటివి సవరించుకొవచ్చని తెలిపారు. ఈ వివరాలు బూత్‌స్థాయి అధికారి యాప్‌లో ఉన్నాయని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయలన్నారు. ఈనెల 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.