kumaram bheem asifabad- మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:14 PM
జిల్లాలో స్వయం సహాయక మహిళ సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. తిర్యాణి మండలంలోని విజయనగరం కాలనీలో శుక్రవారం జంగులబాయి మండల సమాఖ్య భవనాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయ మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు
తిర్యాణి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వయం సహాయక మహిళ సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. తిర్యాణి మండలంలోని విజయనగరం కాలనీలో శుక్రవారం జంగులబాయి మండల సమాఖ్య భవనాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయ మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదుగాలని కోరారు. మహిళలు డబ్బును పొదుపు చేసుకోవాలన్నారు. అలాగే తమ కుటుంబానికి అండగా నిలువాలని కోరారు. మహిళా సంఘాల బలోపేతానికి ఇందిరమ్మ క్యాంటిన్, జిల్లాలో 15 మండలాల్లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో బస్సులను కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ డిపోల్లో నడిపించటం ద్వారా ప్రతి నెల ఒక్కొక్క మండల సమాఖ్యలకు రూ.70వేల ఆదాయం వస్తోందని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. తిర్యాణి మండలం జంగుబాయి మండల సమాఖ్య స్త్రీ నిధి రుణాల రికవరిలో రాష్ట్రంలో తొలి స్థానం సాధించడం ద్వారా జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చినట్టు తెలిపారు. సంఘాల్లో కొత్త సభ్యులను చేర్పించి నూతన సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్నింటా రాణిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే రుణాలను తీసుకొని తిరిగి చెల్లించి ఆర్థికంగా అడుగులు వేయాలన్నారు. అనంతరం వనమహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, ప్రాథమిక సహాకార సంఘం చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఏపీఎం శ్రీనివాస్, జంగుబాయి మండల సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి..
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటరు సంతకం తీసుకొని నింపిన ఫారాలను తిరిగి సేకరించి వెంటనే బీఎల్‌వో యాప్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. మండల కేంద్రంలో చేపట్టిన ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తప్పులు లేకుండా వాస్తవ వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపాలన్నారు. సంబంధిత ఓటరు సంతకంతో నింపాలన్నారు. ఇంటింటికి వెళ్లి సేకరించి బీఎల్‌ఓలు తమ బీఎల్‌ఓ యాప్‌లో నింపాలన్నారు. మరో 20 రోజుల గడువు మాత్రమే మిగిలిఉందన్నారు. ఈ విషయంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.