Share News

ఎంబీబీఎస్‌ ఫీజు నాలుగున్నరేళ్లకే..

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:08 AM

ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్ధులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్త ఊరట కల్పిస్తూ కీలక ప్రకటన చేసింది..

ఎంబీబీఎస్‌ ఫీజు నాలుగున్నరేళ్లకే..

  • 5 సమాన విడతల్లోనే ఫీజు వసూలు చేయాలి

  • ప్రైవేటు కాలేజీలకు హెల్త్‌ వర్సిటీ ఆదేశం

  • ఆ కాలేజీల దోపిడీకి చెక్‌!

  • నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

  • ఫీజు వసూలు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దన్న వర్సిటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్ధులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్త ఊరట కల్పిస్తూ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ కోర్సు చదువుతున్న విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజును ఐదు సమాన విడతల్లో వసూలు చేయాలని స్పష్టం చేస్తూ వర్సిటీ రిజిస్ర్టార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంబీబీఎస్‌ కోర్సు కాలపరిమితి 4.5 ఏళ్లు కాగా విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గ్గించేందుకు మొత్తం ఫీజును ఐదు సమాన వార్షిక విడతల్లో తీసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్త కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. అన్ని మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, లేకుంటే సదరు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే ఈ విషయం అందరికీ తెలిసేలా కాలేజీ నోటీస్‌ బోర్డులపై ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 106, జాతీయ వైద్య కమిషన్‌ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ర్టార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీజుల వసూలు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని యూనివర్సిటీ యాజమాన్యాలకు సూచించింది. కాగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఇప్పటిదాకా ఐదేళ్ల ఫీజును వసూలుచేస్తున్నాయి. బీ కేటగిరీలో కాలేజీని బట్టి రూ.11.25 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఒక ఏడాదికి ఫీజు ఉండగా, సీ కేటగిరీలో రూ.22-23 లక్షల మధ్య ఉంది. ఒక విద్యార్థి బీ కేటగిరీలో మెడిసిన్‌ పూర్తి చేసే వరకు సర్కారు నిబంధనల మేరకు రూ.50 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రూ.56.25 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఆ లెక్కన ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.6.25 లక్షలు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. నిబంధనల మేరకు రూ.50 లక్షలు చెల్లించాలని, ఈ మొత్తం ఐదుసార్లు చెల్లిస్తే సరిపోతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:08 AM