అవిఘ్నమస్తు.. లంబో‘ధర’..
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:00 AM
ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోవడానికి తొలి పూజ గణనాథుడికి చేస్తాం. అందుకే వినాయక చవితి వస్తుందంటే ఉత్సవ కమిటీల్లో నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రం దాదాపు ఆరు నెలల ముందు నుంచే వినాయక విగ్రహాల తయారీతో ముందుగానే చవితి వేడుకల హడావుడి కనిపిస్తోంది. మరో 10 రోజుల్లో చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా వేడుకలకు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోవడానికి తొలి పూజ గణనాథుడికి చేస్తాం. అందుకే వినాయక చవితి వస్తుందంటే ఉత్సవ కమిటీల్లో నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రం దాదాపు ఆరు నెలల ముందు నుంచే వినాయక విగ్రహాల తయారీతో ముందుగానే చవితి వేడుకల హడావుడి కనిపిస్తోంది. మరో 10 రోజుల్లో చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, పెద్దగ్రామాల్లో ఉత్సవ కమిటీల యువకులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల తయారీకి కళాకారులు కుటుంబాలతో సహా తరలివచ్చి తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పెద్దపెద్ద సైజుల్లో విగ్రహాలు తయారుచేసి జిల్లాలోని వివిధ మండలాలకే కాకుండా పొరుగు జిల్లాలకు కూడా విగ్రహాలను విక్రయిస్తున్నారు. మరోవైపు యువత నాందేడ్, హైదరాబాద్, విజయవాడలాంటి ప్రాంతాల నుంచి విభిన్నమైన విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఇప్పుటికే సిరిసిల్లకు చేరుకున్న విగ్రహాలను చూసి ప్రజలు అబ్బురపడుతున్నారు. తీరొక్క రంగులతో వివిధ రకాల ఆకృతులతో ఆకట్టుకుంటున్నాయి. సిరిసిల్లలోని లేబర్ అడ్డ వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 25 ఫీట్ల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈనెల 14న వినాయక చవితి ఉత్సవాల వరకు విగ్రహం పూర్తయ్యే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వేగంగా తయారు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో వాడవాడలా ఉత్సవాల సందడి మొదలైంది.
లంబో‘ధర’ల మోత...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సందడి అప్పుడే మొదలైంది. సిరిసిల్లలోనే పెద్ద సైజు విగ్రహాలు రూ.20 నుంచి రూ.70వేల వరకు తెచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉండే భారీ విగ్రహాలను సైతం ప్రతిష్టించడానికి యువజన సంఘాలు తీసుకవచ్చాయి. గతంలోకంటే ఈసారి ధరలు 25 నుంచి 30 శాతం వరకు అదనంగా పెరిగాయి. చిన్న విగ్రహాలు సైతం భారీ ధరలే ఉండడంతో సామాన్య ప్రజలకు ఉత్సవాలు భారంగానే మారుతున్నాయి. గత సంవత్సరం రూ.60 వేలు ఉన్న విగ్రహం ఇప్పుడు రూ.80 వేలకు పెరిగింది. ఇళ్లలో పూజకు ఉపయోగించే విగ్రహాలు చిన్న సైజ్ రూ.200 నుంచి రూ.500 వరకు, కొద్దిగా పెద్ద సైజ్‌వి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ధరలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధులపై భారం..
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామపంచాయతీలో చైర్‌పర్సన్, సర్పంచ్, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు కొత్తగా ఎన్నికైన తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి వేడుకలు కావడంతో వారికి వినాయకుల భారం తప్పడం లేదు. వారు ఎన్నికల్లో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు గెలుపు కోసం కృషి చేసిన సందర్భాలు ఉండడంతో వినాయక విగ్రహాలకు కొనుగోలు నుంచి మండపాల డెకరేషన్ వరకు ఖర్చులు భరించే పరిస్థితి కనిపిస్తోంది. సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఉత్సవ కమిటీలకు విగ్రహాలు, సౌండ్ బాక్సులు, శోభాయాత్రలకు వాహనాలు సమకూర్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రజాప్రతినిధులకు వినాయకుల భారం తప్పడం లేదని వాపోతున్నారు.