ధాన్యం కుంభకోణంలో దంపతుల అరెస్టు
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:29 AM
నల్లగొండ జిల్లాలో రూ.190 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని కాజేసిన వ్యవహారంలో ఏడు మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుకాగా, నల్లగొండకు చెందిన వ్యాపారి.....
రూ.42.80 కోట్ల ధాన్యం అక్రమంగా విక్రయం.. అక్రమ దందాలో ఏడుగురు వ్యాపారులు
ఓ వ్యాపారిపై నాన్‌బెయిలబుల్ కేసు.. నల్లగొండ జిల్లాలోని ఏడు రైస్‌మిల్లుల్లో..
రూ.190 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి .. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు
నల్లగొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో రూ.190 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని కాజేసిన వ్యవహారంలో ఏడు మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుకాగా, నల్లగొండకు చెందిన వ్యాపారి మహేందర్, అతని భార్య పద్మను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ మహేందర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి కందుకూరి మహేందర్, అతని భార్య పద్మతో పాటు మరో అయిదుగురు కలిసి నల్లగొండ పట్టణంలోని సుమాంజలి రైస్ మిల్, చిట్యాలలోని వరలక్ష్మి పార్‌బాయిల్డ్ రైస్‌మిల్, మునుగోడులోని మనోహర ఆగ్రోఫుడ్ ప్రొడక్ట్స్ రైస్‌మిల్లులను నిర్వహిస్తున్నారు. వీరు 2022-23 యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించి రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌తో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిమిత్తం ఒప్పందం చేసుకున్నారు.
ఈ మేరకు మూడు రైస్‌మిల్లులు కలిపి సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన రూ.42.80కోట్ల విలువైన 13,170.061 మెట్రిక్ టన్నుల ధాన్యానికిి సంబంధించిన బియ్యాన్ని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌కు నిర్ణీత గడువులోగా ఇవ్వలేదు. పైగా ఈ ధాన్యాన్ని తమ మిల్లుల్లో నిల్వ లేకుండా అక్రమంగా విక్రయించుకున్నారని సివిల్ సప్లయీస్ విజిలెన్స్ కమిటీ సైతం నిర్ధారించింది. ఈ మూడు మిల్లుల నిర్వాహకులైన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ, మాశెట్టి రాధాకృష్ణ, మేడం కృష్ణమూర్తి, ఇడుకుళ్ల దామోదర్, కందుకూరి రవికుమార్, బూరుగు బాలకృష్ణపై నల్లగొండ రూరల్, చిట్యాల, మునుగోడు పోలీ్‌సస్టేషన్లలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ అధికారులు ఈ నెల 23వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎస్పీ శరత్‌చంద్రపవార్ నేతృత్వంలో పోలీసులు కేసు విచారణ చేపట్టి నిందితుల్లో ప్రధాన పాత్రధారి కందుకూరి మహేందర్, అతని భార్య పద్మను బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.09 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహేందర్‌పై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, ఇతర నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టం-1955లోని సెక్షన్(7)తో పాటు, బీఎన్‌ఎ్‌స చట్టంలోని 316/2, 316/5, 318/4, 318/3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహేందర్ దంపతులతో కలిసి ఈ అక్రమ దందాల్లో భాగస్వాములైన మరో అయిదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారితో పాటు.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గౌతమి రైస్‌మిల్లు, కనకమహాలక్ష్మి రైస్‌మిల్లు, రామ్‌లక్ష్మణ్ రైస్ ఇండస్ట్రీస్, కేతేపల్లిలోని చాముండేశ్వరి రైస్ మిల్లులకు సంబంధించి రూ.147కోట్ల విలువచేసే సుమారు 55,800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడించారు.