వైద్య శాఖ కోసం భారీ రుణ సమీకరణ
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:53 AM
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి భారీ రుణ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకు నుంచి రూ.3079 కోట్ల రుణం తీసుకోనుంది.
ఏఐఐబీ నుంచి రూ.3079 కోట్లు
ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4150 కోట్లు
రూపురేఖలు మారనున్న సర్కారీ ఆస్పత్రులు
హైదరాబాద్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి భారీ రుణ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకు నుంచి రూ.3079 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నిధులతో రాష్ట్రంలోని బోధనా ఆసుపత్రులు, టీమ్స్ హాస్పిటళ్లు, అలాగే హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4150కోట్ల రుణాన్ని తీసుకోబోతోంది. మొదటి విడతగా రూ.1000 కోట్లు కొద్దినెలల్లో రాబోతున్నాయి. వరల్డ్ బ్యాంకు, ఏఐఐబీల నుంచి వచ్చే రుణాలు కలిపితే మొత్తం రూ.7229 కోట్లు అవుతాయి. ఏఐఐబీ నుంచి వచ్చే లోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో 40ు స్టేట్ షేర్ కింద జమ చేయనుంది. దాంతో మరో రూ.1483కోట్లు జమ అవుతాయి. రూ.8712 కోట్లను ఒక్క వైద్య రంగానికే ఖర్చుపెట్టనున్నారు. ఈ నిధులతో ట్రామాకేర్ కేంద్రాలు, రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్, సెకండరీ, డీఎంఈ ఆస్పత్రుల బలోపేతంతో పాటు టిమ్స్ ఆస్పత్రుల్లో పరికరాలు కొనుగోలు చేస్తారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి నిధులు కేటాయించనున్నారు.