Massive Leak in Sujala Pipeline: కరీంనగర్‌లో సుజల స్రవంతి పైప్ లైన్ లీక్
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:25 AM
హైదరాబాద్‌కు తాగునీరందించే అబ్దుల్ కలాం సుజల స్రవంతి గోదావరి నది పైప్‌లైనుకు శుక్రవారం భారీ లీకేజీ ఏర్పడింది.
హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాలో అంతరాయం
మానకొండూర్/హైదరాబాద్ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు తాగునీరందించే అబ్దుల్ కలాం సుజల స్రవంతి గోదావరి నది పైప్‌లైనుకు శుక్రవారం భారీ లీకేజీ ఏర్పడింది. వేల క్యూసెక్కుల తాగునీరు వృధాగా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ ప్రజలకు తాగునీరందించేందుకు ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఇదికరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మీదుగా ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు జగ్గయ్యపల్లి సమీపంలోని మానేరు వాగు వద్ద పైప్‌లైన్ లీకైంది. 40 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఎగిసిపడ్డాయి.ఘటనాస్థలానికి వెళ్లిన అధికారులిచ్చిన సమాచారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మోటార్లను నిలిపివేశారు. సాయంత్రం లీకేజీ ఆగిపోయింది. లీకైన నీటితో సమీపంలోని పొలాలు నిండిపోయాయి. మరోవైపు, పైపులైను లీకేజీతో హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపును నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నానికి మరమ్మతులు పూర్తి చేసి నగరానికి జలాల తరలింపును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరాలో 24గంటల పాటు అంతరాయం కలగనుంది.