అమీర్‌పేట షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:07 AM
అమీర్‌పేటలో ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లోని హెల్మెట్ షోరూం సమీపంలో పొగలు రావడం...
మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్
క్షణాల్లో పాకిన మంటలు, దట్టమైన పొగలు
కాలిపోయిన దుస్తులు, హెల్మెట్ షాపులు
పాక్షికంగా దెబ్బతిన్న మరో ఐదు దుకాణాలు
3గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
బంజారాహిల్స్/ యూసు్‌ఫగూడ, హైదరాబాద్ సిటీ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): అమీర్‌పేటలో ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లోని హెల్మెట్ షోరూం సమీపంలో పొగలు రావడం గమనించిన సిబ్బంది పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు షోరూంతో పాటు పైఅంతస్తులోని కేఎ్‌సఆర్ ఫ్యాషన్స్ దుకాణానికి పాకాయి. కొద్ది సేపటికి వరకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలకు ఉపక్రమించారు. అయితే మంటలు ఎగసిపడుతుండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. చివరకు రోబో పంప్ సాయంతో వేగంగా నీటిని చిమ్మడంతో క్రమంగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఆరు ఫైరింజన్లతో సుమారు 3 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. ఘటనలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా ట్రాఫిక్ జాం
దట్టమైన పొగ, మంటలు ఎగిసి పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఎర్రగడ్డ నుంచి వస్తున్న వాహనాలను ఎస్‌ఆర్ నగర్ చౌరస్తా, వెంగళరావు నగర్, బల్కంపేట మీదుగా మళ్లించారు. పంజాగుట్ట నుంచి వస్తున్న వాహనాలను శ్రీనగర్ కాలనీ, యూసు్‌ఫగూడ వైపు మళ్లించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, మాజీ మంత్రి తలసాని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటనను సెల్‌ఫోన్లలో వీడియో తీసేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఓ దశలో అగ్నిమాపక సిబ్బందికి కూడా అడ్డుగా మారారు.
మెట్రో రైలుకు నష్టం జరగలేదు
అగ్నిప్రమాద ఘటనలో మెట్రో రైలు వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. దట్టమైన పొగ కారణంగా కొంత అసౌకర్యం కలిగినా, మెట్రో రైలు కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. మెట్రో స్తంభాలపై అమర్చిన ప్రకటనల బోర్డుల వినైల్ షీట్లపై మాత్రమే అగ్నిప్రమాదం ప్రభావం ఉందని ఆయన వివరించారు. మెట్రో ట్రాక్‌కు 20 అడుగుల దూరంలోనే ఘటన జరగడం, పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ రావడంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు మంటలు ఆర్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.