Massive Police Transfers: భారీస్థాయిలో ఏసీపీల బదిలీలు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:42 AM
పోలీసు కమిషనరేట్ల పరిధి మార్పు, కొత్తగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో నూతన సబ్ డివిజన్లలో ఏసీపీల నియామకానికి ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.
4 కమిషనరేట్లలో కొత్త సబ్ డివిజన్లు
ఉన్నవారిని సర్దుబాటు చేస్తూ కొత్తవారికి పోస్టింగ్‌లకు అవకాశం
ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్‌లో తొలుత మార్పులకు అవకాశం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పోలీసు కమిషనరేట్ల పరిధి మార్పు, కొత్తగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో నూతన సబ్ డివిజన్లలో ఏసీపీల నియామకానికి ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 20 మంది డీసీపీలను నియమించారు. పోలీస్ కమిషనరేట్ల పునర్‌వ్యవస్థీకరణతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల ఏసీపీ సబ్ డివిజన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లలో పలు కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. పోలీసు స్టేషన్ల పరిధి మారడంతో పాటు కొన్ని సబ్‌డివిజన్లు ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్‌కు మారాయి. ఈ నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా గతంలో హైదరాబాద్‌లో పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌లలో ప్రాధాన్యం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల బదిలీల తర్వాత ఇతర విభాగాల వైపు ఉన్నతాధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. దాదాపు 100 మందికి పైగా ఏసీపీలు బదిలీ అవుతారని తెలుస్తోంది. ఒకటీ, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని సమాచారం.