Share News

రూ.70 వేల కోట్ల టర్నోవర్‌ను దాచేసిన రెస్టారెంట్లు

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:34 AM

హైదరాబాద్‌లో కొన్ని రెస్టారెంట్లపై గత నవంబరులో నిర్వహించిన సాధారణ తనిఖీలు.. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల రంగంలో ఓ భారీ పన్ను కుంభకోణాన్ని బయటపెట్టాయి.

రూ.70 వేల కోట్ల టర్నోవర్‌ను దాచేసిన రెస్టారెంట్లు

  • పన్ను ఎగవేతకు బిల్లింగ్‌లో భారీగా అక్రమాలు

  • ముందు హైదరాబాద్‌లో తనిఖీలతో వెలుగులోకి..తర్వాత ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఐటీ దాడులు

హైదరాబాద్‌/బెంగళూరు, ఫిబ్రవరి 19: హైదరాబాద్‌లో కొన్ని రెస్టారెంట్లపై గత నవంబరులో నిర్వహించిన సాధారణ తనిఖీలు.. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల రంగంలో ఓ భారీ పన్ను కుంభకోణాన్ని బయటపెట్టాయి. అనేక రెస్టారెంట్లు పన్ను ఎగవేయడానికి మొత్తం రూ.70 వేల కోట్ల టర్నోవర్‌ను లెక్కల్లో చూపకుండా దాచేశాయి. ఓ పేరొందిన బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాంను దుర్వినియోగం చేస్తూ టర్నోవర్‌ను తగ్గించి చూపించాయని ఆదాయం పన్ను శాఖ అధికారులు గుర్తించారు. 2019-20 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 1.77 లక్షల రెస్టారెంట్ల లావాదేవీలకు సంబంధించిన 60 టెరాబైట్ల డాటాను హైదరాబాద్‌లోని ఆయకార్‌ భవన్‌లోని డిజిటల్‌ ల్యాబ్‌లో ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేశారు. ఇందుకు కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ను ఉపయోగించారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆయా రెస్టారెంట్ల మొత్తం బిల్లింగ్‌ 2.43 లక్షల కోట్లలో రూ.13,317 కోట్ల లావాదేవీలను బిల్లింగ్‌ చేసిన తర్వాత లెక్కల్లోంచి తొలగించినట్లు అధికారులు గుర్తించారు. టర్నోవర్‌ను తగ్గించడానికి రెస్టారెంట్ల యజమానులు వివిధ మార్గాలను అనుసరించినట్లు కనుగొన్నారు. రెస్టారెంట్ల యజమానులు నగదు చెల్లింపులను ముందు బిల్లింగ్‌ సిస్టమ్‌లో నమోదు చేసినా తర్వాత వాటిలో కొన్నింటిని తొలగించారు. మధ్య మధ్యలో కొన్ని రోజుల బిల్లింగ్‌ రికార్డులను మాయం చేశారు. కొన్ని రెస్టారెంట్లు బిల్లింగ్‌ ఎంట్రీలను డిలీట్‌ చేయకపోయినా టర్నోవర్‌ను తగ్గించి చూపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో 3,734 పాన్‌ కార్డులకు సంబంధించి రూ.5141 కోట్ల టర్నోవర్‌ను తగ్గించి చూపించారని ఐటీ అధికారులు గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోని ఓ 40 రెస్టారెంట్లే రూ.400 కోట్ల టర్నోవర్‌ను తగ్గించి చూపాయి. చాలా రెస్టారెంట్లు అమ్మకాలను 27 శాతం తగ్గించి చూపాయని అధికారులు అంచనాకు వచ్చారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లకు చెందిన రెస్టారెంట్లు ఈ స్కామ్‌లో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ముందు హైదరాబాద్‌, తర్వాత ఏపీలోని విశాఖపట్నంలో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి.. అక్కడ గుర్తించిన అక్రమాల ఆధారంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించింది.

Updated Date - Feb 20 , 2026 | 02:34 AM