మక్కలకు ‘అక్రమ టెండర్’!
ABN , Publish Date - May 04 , 2026 | 04:28 AM
ప్రభుత్వం వద్ద ఉన్న మొక్కజొన్నలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లపై అక్రమార్కుల కన్ను పడింది. గతంలో ధాన్యం టెండర్లను శాసించి రూ.4 వేల కోట్ల ...
కేంద్రీయ భండార్, న్యాకాఫ్ ఏజెన్సీల బిడ్లను తిరస్కరించిన మార్క్‌ఫెడ్
గతంలో ధాన్యం టెండర్లలో ఈ సంస్థల అక్రమాలు?
సకాలంలో ధాన్యం తీసుకోక పోవటంతో సివిల్ సప్లైస్‌లో రూ.69 కోట్ల ఈఎండీ జప్తు
ఇప్పుడు మళ్లీ మక్కల టెండర్లను శాసించేందుకు ఆ ఏజెన్సీల బిడ్లు
బిడ్లను తిరస్కరించటంతో కోర్టుకు వెళ్లి మోకాలడ్డుతున్న వైనం
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వద్ద ఉన్న మొక్కజొన్నలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లపై అక్రమార్కుల కన్ను పడింది. గతంలో ధాన్యం టెండర్లను శాసించి రూ.4 వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ఏజెన్సీలే ఇప్పుడు మక్కల టెండర్లను చిన్నాభిన్నం చేసేందుకు రంగంలోకి దిగాయి. రెండేళ్ల క్రితం ధాన్యం టెండర్లను దక్కించుకొని బస్తా లోడెత్తని సిండికేట్ శ్రీనివాసరావు.. ఇప్పుడు మక్కల టెండర్లలో తలదూర్చటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గత వానాకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.80 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను వేలంలో విక్రయించటానికి మార్క్‌ఫెడ్ టెండర్లు పిలిచింది. తొలుత గోదాములవారీగా టెండర్లు పిలిస్తే.. ఏజెన్సీల నుంచి స్పందన రాలేదు. దీంతో 3.80 లక్షల టన్నులను 5 లాట్లుగా విభజించి రెండోసారి టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 23 వరకు టెండర్లు స్వీకరించారు. ఐదు ఏజెన్సీలు సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో లాటుకు రెండు చొప్పున 10 టెండరు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. సగటున క్వింటాలుకు రూ.1,400 నుంచి రూ. 1,500 వరకు కోట్ చేసినట్లు తెలిసింది.
ఆ రెండు ఏజెన్సీలతోనే సమస్య..!
మక్కల టెండర్లలో పాల్గొన్న ఏజెన్సీల్లోని రెండింటిపైౖ మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివా్‌సరెడ్డికి ఏప్రిల్ 24న ఫిర్యాదులు వచ్చాయి. కేంద్రీయ భండార్, జాతీయ వ్యవసాయ సహకార సంస్థ (న్యాకాఫ్) అనే ఏజెన్సీలు గతంలో పాల్గొన్న వివిధ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022- 23 యాసంగి ధాన్యం టెండర్లలో పాల్గొన్న ఈ ఏజెన్సీలు టెండరు నిబంధనలు పాటించలేదని, సకాలంలో ధాన్యం తీసుకోకపోవటంతో రూ.69 కోట్ల ఈఎండీని రాష్ట్ర ప్రభుత్వం జప్తుచేసిందని గుర్తుచేశారు. ఏపీఎంఎ్‌సఐడీసీ టెండర్లు దక్కించుకొని నాణ్యతలేని సరుకు సరఫరా చేసినందుకు 2023 ఏప్రిల్ 10వ తేదీ నుంచి 2025 ఏప్రిల్ 9 వరకు ఏపీ ప్రభుత్వం కేంద్రీయ భండార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాకా్‌ఫను ఒడిశా, అస్సాం ప్రభత్వాలు బ్లాక్ లిస్టులో పెట్టాయని తెలిపారు. దీంతో ఈ రెండు సంస్థల టెక్నికల్ బిడ్లను మార్క్‌ఫెడ్ ఎండీ రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నెల ఆరో తేదీన కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. అప్పటివరకు ఫైనాన్షియల్ (వాణిజ్య) బిడ్లను తెరవకుండా మార్క్‌ఫెడ్ వేచిచూస్తోంది. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు మక్కలు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ మక్కలను కొనుగోలు చేస్తోంది. గోదాముల నుంచి పాత మక్కలు బయటికెళ్తేనే కొత్త పంటను నిల్వచేసే అవకాశం ఉంటుంది.