మక్కల విక్రయానికి మూడో సారి టెండర్లు
ABN , Publish Date - May 23 , 2026 | 04:47 AM
గత ఏడాది సేకరించిన మక్కలను విక్రయించేందుకు ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచి రద్దు చేసిన మార్క్‌ఫెడ్.. తాజాగా మూడో సారి టెండర్లు పిలిచింది.
ఈ సారి 25 లాట్లుగా విభజించిన మార్క్‌ఫెడ్
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది సేకరించిన మక్కలను విక్రయించేందుకు ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచి రద్దు చేసిన మార్క్‌ఫెడ్.. తాజాగా మూడో సారి టెండర్లు పిలిచింది. వ్యాపారుల మధ్య పోటీ నెలకొల్పడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ధరకు విక్రయించేందుకు... 3.80లక్షల టన్నులను 25 లాట్లు(భాగాలుగా)గా విభజించి నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఒక్కో లాట్‌లో 15,200 టన్నులు ఉంటాయి. గతంలో జారీ చేసిన టెండర్లలో మొత్తం పరిమాణాన్ని 5 లాట్లుగా విభజించారు. దీంతో ఒక్కో లాటుకు 76 వేల టన్నులు వచ్చాయి. ఎక్కువ పరిమాణం కావడంతో పెద్ద కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి. ఇప్పుడు లాట్ల పరిమాణం 15 వేల టన్నులకు తగ్గించడంతో... ఎక్కువ మంది వ్యాపారులు పోటీపడే అవకాశం దక్కనుంది. వ్యాపారుల మధ్య పోటీ ఉంటే ధర ఎక్కువ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మక్కల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 కాగా... ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.1,800చొప్పున ధర పలుకుతోంది. గతంలో రద్దు చేసిన టెండర్లలో ఐదు ఏజెన్సీలు కూటమి కట్టి.. క్వింటాల్‌కు రూ.1,400 చొప్పున ధర కోట్ చేశాయి. ఎమ్మెస్పీతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.1,000 నష్టం వస్తోందని, ఈ మొత్తం రూ.380 కోట్లు ఉంటుందని ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసిన విషయం విదితమే. దీంతో ఈ సారి టెండరు నిబంధనలను మార్క్‌ఫెడ్ మార్చింది. ఎక్కువ మంది వ్యాపారులకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించింది. అయితే, ఈసారి ధరఎంత కోట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.