Pongulati Srinivas Reddy: కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:11 AM
కుంభమేళాకంటే అద్భుతంగా మేడారం జాతరను తమ ప్రభుత్వం నిర్వహించనున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
19 ఉదయం గిరిజన సంప్రదాయాలతో గద్దెలను ప్రారంభించనున్న సీఎం రేవంత్
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
తాడ్వాయి/ ఖమ్మం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కుంభమేళాకంటే అద్భుతంగా మేడారం జాతరను తమ ప్రభుత్వం నిర్వహించనున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 18-31 మధ్య జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో దేశవ్యాప్తంగా గిరిజన, గిరిజనేతరులు పాల్గొంటారన్నారు. ఈ నెల 18 సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులంతా చేరుకున్న తర్వాత మేడారంలో క్యాబినెట్ సమావేశం జరుగనున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని తొలిసారి రాజధాని ఆవల గిరిజన ప్రాంతం మారుమూల గ్రామంలో నిర్వహించనున్నామని శుక్రవారం ఖమ్మంలో మీడియాకు ఆయన చెప్పారు. రెండేళ్లకోమారు జరిగే జాతర నిర్వహణకు ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశామన్నారు. 19 ఉదయం గిరిజన పూజారుల సంప్రదాయం ప్రకారం నూతనంగా నిర్మించిన సమ్మక్క-సారలమ్మ రాతి గద్దెలు, ఇతర నిర్మాణాలను సీఎం రేవంత్ ప్రారంభిస్తారని పొంగులేటి తెలిపారు.
ప్రకృతిని ప్రతిబింబించేలా మహా జాతర
మేడారం మహా జాతరలో ప్రకృతి సౌందర్యం ప్రతిబింబించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రాష్ట్ర మంతులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి గురువారం అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో కలియ తిరిగి పరిశీలించారు. సంక్రాంతి రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 18న జాతర ప్రారంభోత్సవ ఏర్పాట్లతోపాటు సీఎం రేవంత్ రెడ్డి రాకతో తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మేడారం హరిత హోటల్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. దేవస్థానం ప్రధాన ద్వారం, ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, పిటి బీమ్స్‌పై అమరుస్తున్న బ్రాకెట్లు, మీడియా టవర్లు, క్యూలైన్ల షెడ్ల నిర్మాణ పనులపై వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతర పరిసరాలను జోన్లు, యూనిట్ల వారీగా విభజించి.. జోన్‌కో పర్యవేక్షణ అ ధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచానికి చాటి చెప్పేలా జాతర ఏర్పాట్లు ఉండాలని చెప్పారు.
పాలేరులో రూ.362 కోట్లతో అభివృద్ధి పనులు
తమ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 18న ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. సభ జరిగే మద్దులపల్లి ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి.. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో రూ.362 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారన్నారు. పాలేరులో జేఎన్‌టీయూ కళాశాల భవనం, కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రిలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. పాలేరు రిజర్వాయర్‌కు మున్నేరు వృథా జలాలను అనుసంధానించే లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారని పొంగులేటి చెప్పారు.