నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:41 AM
మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది.
ప్రముఖ ఆలయాల మూసివేత
హైదరాబాద్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. దేశంలో ఇది పాక్షికంగా కనిపించనుంది. అయితే గ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవకాశం కలగనుంది. మంగళవారం సాయంత్రం సూర్యాస్తమయ్యే 6.20 గంటల నుంచి 6.47గంటల వరకు అంటే దాదాపు 27 నిమిషాల పాటు చూసేందుకు అవకాశముంది. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు.. సుమారు 10.30 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. 8.30 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని మూసివేస్తారు. మంగళవారం ఉదయం 7గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ వేకువజామున 3గంటల వరకు ఆలయం మూసివేస్తారు. బుధవారం వేకువజామున 3గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.