నేడు మీడియా ముందుకు దేవ్‌జీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:04 AM
తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్....
తిప్పిరి తిరుపతితో పాటు మల్లా రాజిరెడ్డి తదితర మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు
వివరాలను వెల్లడించనున్న డీజీపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నన తదితరులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును అధికారికంగా ప్రకటించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేవ్‌జీ, రాజిరెడ్డి తదితరులు లొంగిపోయినట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో తెలంగాణ వ్యక్తులు 15 మంది ఉన్నారని.. వారంతా లొంగిపోవాలని ఇటీవల డీజీపీ సూచించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వారు లొంగిపోయేలా రాష్ట్ర పోలీసులు సుదీర్ఘ వ్యూహం అనుసరించారు. ఒక సైద్ధాంతిక వాదానికి కట్టుబడి దశాబ్దాల తరబడి ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారికి.. ‘మీ సిద్ధాంతాలు విఫలమయ్యాయి. ఆలోచన చేసుకోండి. అడవుల్లో ఉండి కాదు ప్రజా క్షేత్రంలోకి వచ్చి చూసుకోండ’ని చెప్పడం ఒక సాహసమే. పీపుల్స్ వార్ నుంచి మొదలైన ప్రస్థానం అనేక మలుపులు తిరిగి మావోయిస్టు పార్టీగా మారడంలో కీలక పాత్ర వహించిన నేతల నమ్మకాన్ని పోలీసులు సంపాదించుకోవడం వెనుక గత రెండేండ్లుగా కసరత్తు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రక్తపాతాన్ని నివారించాలని 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు నిర్దేశించారు. దాంతో మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ)లో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ప్రస్తుత ఎస్‌ఐబీ ఐజీ సుమతితో కలసి ‘ఆపరేషన్ కగార్’ వేళ తనదైన వ్యూహాలను రచించారు. మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తూ, లొంగిపోయిన వారికో గౌరవం, చిరునామా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి పునరాసానికి కట్టుబడి ఉందన్న సంకేతాలను ఆ పార్టీ అగ్రనేతలకు చేరేలా చూశారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకుని రెండేండ్ల పాటు ఓపిగ్గా తమదైన శైలిలో వెళ్లారు. కేంద్రం తమ వ్యూహాన్ని సరిగ్గా అర్థం చేసుకొనేట్టు చేశారు. దాంతో గత రెండేండ్లలో సుమారు 600 మంది అజ్ఞాత తీవ్రవాదులు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. వీరిలో 95 శాతం మంది ఛత్తీస్గఢ్‌కు చెందినవారు. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా మార్చి 31 డెడ్‌లైన్ పెట్టుకున్న కేంద్రానికి.. ఆ గడువుకు ముందే ‘ఆపరేషన్ ఆమ్నెస్టీ’ ద్వారా దేవ్‌జీ, రాజిరెడ్డి, గంగన్న తదితర సీనియర్ మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును తెలంగాణ పోలీసులు చూపించబోతున్నారు. ‘ఇదొక సుదీర్ఘ ప్రణాళిక. ముందుగా మావోయిస్టు నేతలకు నమ్మకం కలిగించడం మా ముందు ఉన్న పెద్ద టాస్క్. దానికి ఎంతోమంది పోలీసు అధికారులు వివిధస్థాయిల్లో పనిచేసి చివరికి విజయం సాధించార’ని సీనియర్ పోలీసు అధికారులు అన్నారు.