Share News

మావోయిస్టులపై ‘విష’ తూటాల ప్రయోగం?

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:31 AM

మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొంటున్న భద్రతా బలగాలు విషపూరిత తూటాలు వాడుతున్నాయా?.. అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలతో తలపడుతున్నాయా....

మావోయిస్టులపై ‘విష’ తూటాల ప్రయోగం?

  • తీవ్రమైన మంట.. వాంతులు.. భరించలేని దాహం!

  • ఎన్‌కౌంటర్‌లో భయంకర అనుభవాలు

  • సంచలనం సృష్టిస్తున్న మావోయిస్టు అగ్రనేత ఫినిక్స్‌ కథనం

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొంటున్న భద్రతా బలగాలు విషపూరిత తూటాలు వాడుతున్నాయా?.. అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలతో తలపడుతున్నాయా ?.. జీవ రసాయన పదార్థాల వాడకం అంతర్గతంగా జరుగుతోందా? అంటే అవుననే అంటున్నాయి మావోయిస్టు వర్గాలు. ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్‌ జిల్లా కుల్హదీఘాట్‌ అడవుల్లో గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి బయటపడిన ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్‌’ పేరిట రాసిన రిపోర్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భద్రతా బలగాలు ప్రయోగించిన షెల్‌ ముక్కలు తగిలిన వారు కేవలం గాయాలతోనే కాకుండా.. నొప్పి, మంట, భరించలేని బాధతో విలవిలలాడుతూ తీవ్రమైన దాహంతో వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆ కథనంలో పేర్కొనారు.

నరకం చూపించిన విష షెల్లింగ్‌ !

గరియాబంద్‌ అడవుల్లో గతేడాది మావోయుస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరమైన ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ)తో పాటు ఒడిసా స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు(ఎస్ఓజీ), సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియన్లకు చెందిన 400మంది భద్రతా బలగాలు ఈ సంయుక్త ఆపరేషన్‌ను పర్యవేక్షించాయి. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి సహా 16మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న ఒక మావోయిస్టు నేత ఘటనా స్థలంలో తాను ఎదుర్కొన్న పరిస్ధితులను వివరిస్తూ పార్టీకి రిపోర్టు పంపారు. షెల్స్‌ తగిలిన సహచర మావోయిస్టులు తీవ్రమైన నొప్పి, భరించలేని మంటతో అరిచారని అందులో తెలిపారు. దానికి తోడు విపరీతమైన దాహం, వాంతులతో నరకయాతన అనుభవించారని వెల్లడించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ద్వారా వెలుగులోకి తీసుకుని రావడంతో దీనిపై చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ కెమికల్‌ వెపన్‌ కన్వెన్షన్‌ (సీడబ్లూసీ) ఒప్పందంపై సంతకం చేసిన భారత్‌ కూడా.. ఇలాంటి విషపు పూత పూసిన షెల్స్‌ వాడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Mar 02 , 2026 | 03:12 AM