Share News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పాపారావు లొంగుబాటు

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:25 AM

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దండకారణ్యం నుంచి తుపాకులతో వచ్చిన పాపారావు అతని బృందాన్ని బలగాలు ప్రత్యేక బస్సులో ...

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పాపారావు లొంగుబాటు

  • మరో 17 మంది కూడా.. వారిలో ఏడుగురు మహిళలు

  • పాపారావుపై రూ.25 లక్షల రివార్డు

చర్ల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దండకారణ్యం నుంచి తుపాకులతో వచ్చిన పాపారావు అతని బృందాన్ని బలగాలు ప్రత్యేక బస్సులో జగదల్‌పూర్‌ తరలించాయి. బుధవారం ఉపముఖ్యమంత్రి సమక్షంలో మొత్తం 18 మంది సభ్యులను మీడియాకు చూపనున్నారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. సుకుమా జిల్లా పుట్టపాడు గ్రామానికి చెందిన పాపారావు గత 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారు. అతని భార్య ఊర్మిళ పామేడు ఏరియా కమిటీ కమాండర్‌గా పని చేస్తూ.. జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పాపారావు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి ప్రస్తుతం దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. అతనిపై సుమారు రూ.25 లక్షల రివార్డు ఉంది. 2010 తాడిమెట్లలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై జరిగిన దాడిలో 76 మంది పోలీసులు చనిపోయారు. ఆ ఘటనలో పాపారావు ప్రధాన నిందితుడు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో మావోయిస్టులు జరిపిన పలు విధ్వంసకర ఘటనల్లో పాపారావు సూత్రధారుడిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ హోం శాఖ మంత్రి విజయశర్మ మీడియాతో మాట్లాడుతూ.. పాపారావు లొంగుబాటు పెద్ద విజయమన్నారు. దండకారణ్యంలో ప్రస్తుతం పాపారావు తప్ప పెద్దనాయకుడు ఎవరూలేరని చెప్పారు. మార్చి 31నాటికి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లోని మావోయిస్టులు కూడా లొంగిపోతారని, దేశంలో మావోయిస్టులు అనేవారు ఉండరని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 04:25 AM