లొంగుబాటలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నరహరి
ABN , Publish Date - May 13 , 2026 | 04:28 AM
మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.
హైదరాబాద్/కాజీపేట, మే 12 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం జార్కండ్‌లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరహరి.. ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. నరహరి దంపతులతో పాటు మావోయిస్టు పార్టీ రాష్ట్రస్థాయి నేత వార్తా శేఖర్ అలియాస్ మంగూ సైతం లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన నరహరి మూడు దశాబ్దాల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్‌ఎ్‌సయూ) ద్వారా పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరారు. నాటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, మరో నేత క్రాంతి రణదేవ్‌ల సహకారంతో నరహరి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని తెలుస్తోంది. ఆయనకు శాస్త్ర సాంకేతిక విషయాలపై పట్టుండటంతో మావోయిస్టు పార్టీ టెక్నికల్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మావోయిస్టు అగ్రనేతలు ఒకరి తర్వాత మరొకరు లొంగిపోయినా.. నరహరి మాత్రం లొంగుబాటుకు ససేమిరా అన్నారని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. నరహరి భార్య ఏపీకి చెందిన మావోయిస్టు పార్టీ నాయకురాలని సమాచారం. మరో కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రాతో కలిసి సరండా అటవీ ప్రాంతంలో నరహరి కార్యకలాపాలు నిర్వహించారు. మిసిర్ బెస్రా వర్గం సైతం లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నరహరి తనకు తెలిసిన కొంతమంది ద్వారా తెలంగాణ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీరి లొంగుబాటును ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. నరహరి, వార్తా శేఖర్ లొంగుబాటు తర్వాత ఇక తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి, ఆయన భార్య రత్నాభాయ్ మాత్రమే ఇంకా అజ్ఙాతంలో ఉన్నారని నిఘా వర్గా లు పేర్కొంటున్నాయి. గణపతి ఎక్కడున్నారనే విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
మావోయిస్టుల డంప్‌లో రూ.1.64కోట్ల నగదు
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ పూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో మంగళవారం మావోయిస్టు పార్టీకి చెందిన భారీ బంకర్‌ను కేంద్ర బలగాలు గుర్తించాయి. అందులో మావోయిస్టుల దాచిన ఆయుధాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా గుర్తించిన భారీ బంకర్‌లో రూ.1.64కోట్ల నగదు, మూడు ఏకే 47, మూడు ఎస్‌ఎల్‌ఆర్, నాటు, బోరు, దేశీ, కట్టా తుపాకులు, తుపాకులకు చెందిన మ్యాగజైన్లు, వైర్లు, బీజీఎల్ లాంచర్లు, బ్యాటరీలు, యూనిఫాంలు, రోజూ వారి వినియోగించే పరికరాలు ఇలా మొత్తం 28రకాల వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు నారాయణపూర్‌లో 270 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని జిల్లా పోలీసులు తెలిపారు.