మావోయిస్టు నరహరి లొంగుబాటు
ABN , Publish Date - May 27 , 2026 | 05:14 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్-ఝార్ఖండ్ రాష్ట్రాల స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి, అతడి భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు దానమ్మ ....
ఇంకా దేశంలో 47మంది మావోయిస్టులే మిగిలారు
తెలంగాణ వాళ్లు ముగ్గురే.. వారిలోనూ ఒక్కరే యాక్టివ్
గణపతి.. లొంగిపోండి.. మెరుగైన వైద్యం అందిస్తాం
ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ను కొనసాగిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, కాజీపేట, మే 26 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్-ఝార్ఖండ్ రాష్ట్రాల స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి, అతడి భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు దానమ్మ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. నరహరి పేరిట ఉన్న రూ.25లక్షలు, దానమ్మ పేరిట ఉన్న రూ.20లక్షల రివార్డు మొత్తాన్ని డీడీల రూపంలో వారికి డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 50 ఏళ్ల నక్సలిజం ప్రస్తానం అంత్య దశకు చేరుకుందని, ఇంకా ఆ పార్టీలో దేశవ్యాప్తంగా కేవలం 47మంది మాత్రమే మిగిలి ఉన్నారని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 15 మంది, ఝార్ఖండ్‌కు చెందిన 13 మంది, ఒడిశాకు చెందిన 15 మంది, తెలంగాణకు చెందిన 3, ఏపీకి చెందిన ఒక్కరు ఉన్నారని తెలిపారు. తెలంగాణకు సంబంధించి మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆయన భార్య జోడే భాయ్, వార్త శేఖర్ అలియాస్ మంగ్తూ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. గణపతి, ఆయన భార్య విదేశాలకు వెళ్లినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, దేశంలోనే ఎక్కడో చోట ఉండి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గణపతి, ఆయన భార్య.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాన్ని వినియోగించుకుని జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన వార్త శేఖర్ మాత్రమే దండకారణ్యంలో ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. నరహరి, ఆయన భార్య దాదాపు పది రోజుల క్రితమే తమ కాంటాక్ట్‌లోకి వచ్చారని డీజీపీ తెలిపారు. ఆ సమయంలో తీవ్రమైన డెంగీ జ్వరంతో బాధపడుతున్నారని, వారికి మెరుగైన వైద్య చికిత్స అందించామని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఐడియాలజీపై ప్రభుత్వానికి అవగాహన ఉందని, గత అనుభవాల దృష్ట్యా గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కదలికలపై ప్రతి నెలా సమీక్షిస్తున్నామని వివరించారు.
సాంకేతికతలో దిట్ట నరహరి..
నరహరి మావోయిస్టు పార్టీ సాంకేతిక విభాగంలో నిపుణుడు. ఆ విభాగం బాధ్యతలను ఆయన సుదీర్ఘకాలం నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి లో జన్మించిన నరహరి వరంగల్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నపుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభావంతో పీపుల్స్‌వార్‌లో చేరారు. 1982లో నాటి పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య ప్రేరణతో కుంట దళంలో సభ్యుడిగా చేరారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటి నుంచి లొంగిపోయేంత వరకు బిహార్-ఝార్ఖండ్ ఏరియాలో ఉన్నారు. బూబీ ట్రాప్స్‌తోపాటు, తుపాకులు, మోర్టార్లు, గ్రనేడ్ లాంచర్ల తయారీ, నిర్వహణలో నరహరి అపార నైపుణ్యం సంపాదించారు. నరహరి భార్య మేదర దానమ్మ గుంటూరు జిల్లా గామాలపాడు నివాసి. ఆమె 1986 నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఉన్నారు. 1988లో నరహరిని వివాహం చేసుకున్న తర్వాత సాంకేతిక విభాగంలోనే కొనసాగారు. కాగా, సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేనందునే జనజీవన స్రవంతిలోకి వచ్చామని నరహరి పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా, గణపతి సైతం లొంగిపోవాలని కోరారు.