మావోయిస్టు గణపతి‘సేఫ్ షెల్టర్’ ఎక్కడుంది?
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:10 AM
భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించినా... మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి...
స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర హోంమంత్రి
ఆచూకీ తెలియక తలలుబద్దలు కొట్టుకుంటున్న నిఘావర్గాలు
హైదరాబాద్,ఏప్రిల్10(ఆంధ్రజ్యోతి): భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించినా... మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి(76) ఆచూకీపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘గణపతి బతికే ఉన్నారు.. కానీ అడవుల్లో కాదంటూ’ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టీకరించినా.. మరి ఆయన ఎక్కడున్నారు.. దేశంలోనేనా.. విదేశాల్లోని షెల్డర్‌లోనా? అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు..? ఇలాంటి విషయాలపై మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, నిఘా వర్గాల్లో అసక్తికర చర్చ జరుగుతోంది. కాగా జగిత్యాల జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి అనారోగ్య కారణాలతో 2018లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా 2022 వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరి చేయూత లేకుండా ఆయన నడవలేని పరిస్థితిలో ఉండడం.. కేంద్ర బలగాల భారీ ఆపరేషన్లు ప్రారంభం కావడం.. శతృవు కమ్ముకొస్తున్న వేళ ఆయనకు రక్షణ కల్పించడం ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. గణపతిని ఆయన భార్య జోడే రత్నాబాయిని ‘సేఫ్ షెల్టర్‌క’ు తరలించాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం. ఆ బాధ్యత వహించిన.. నాటి పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ తీసుకున్న నిర్ణయమే ప్రస్తుతం గణపతి ఆచూకీ కనిపెట్టడంలో నిఘావర్గాలకు తలకుమించిన భారంగా మారడానికి కారణమైంది. గణపతిని, ఆయన భార్యను రక్షిత ప్రాంతానికి తరలిస్తూ కొన్నేళ్ల పాటు వారు బయటికి రాకున్నా ఇబ్బందులు కలగకుండా ఆర్థిక ఏర్పాట్లు సైతం బసవరాజ్ చేశారు. గణపతిని ఏ రాష్ట్రంలో ఉంచారు.. నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు తరలించారా? అనే విషయం కేవలం బసవరాజ్‌కే తెలుసు. ఈపరిస్థితుల్లో గతేడాది మే నెలలో చత్తీ్‌సగఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో కేశవరావు(70)సహా 27మంది మావోయిస్టులు మరణించారు. దీంతో గణపతి సమాచారం సమా ధి అయ్యిందని మాజీ మావోయిస్టులు భావిస్తున్నారు. బసవరాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత అనధికారికంగా కార్యదర్శిగా వ్యవహరించిన దేవ్‌జీ అరెస్టు కావడంతో గణపతి ఆచూకీ తెలియవచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. దేవ్‌జీని, రాజిరెడ్డిని నిఘావర్గాలు రోజుల తరబడి ప్రశ్నించినా సమాధానం రాబట్టలేక పోయారు.