Share News

మావోయిస్టు నేత భాగ్య అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:22 AM

చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపీ అంత్యక్రియలు సిద్దిపేటలోని ఆమె స్వగ్రామం ధర్మారంలో బుధవారం ముగిశాయి.

మావోయిస్టు నేత భాగ్య అంత్యక్రియలు పూర్తి

  • విప్లవ నినాదాల మధ్య సాగిన అంతిమయాత్ర

  • బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ప్రజాసంఘాల ఆరోపణ

మిరుదొడ్డి/దుబ్బాక, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపీ అంత్యక్రియలు సిద్దిపేటలోని ఆమె స్వగ్రామం ధర్మారంలో బుధవారం ముగిశాయి. విప్లవ నినాదాలు, అమరవీరుల పాటల మధ్య కుటుంబసభ్యులు, ప్రజాసంఘాల నేతలు ఆమెకు తుది వీడ్కోలు పలికారు. రెండ్రోజులుగా కన్నబిడ్డ కోసం నిద్రలేకుండా ఎదురుచూసిన తల్లి ఎల్లవ్వ, తన చేతులతోనే కూతురుకి తలకొరివి పెట్టింది. అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు. మృతదేహాన్ని పరిశీలించిన అమరుల బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నేతలు ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. భాగ్యను పోలీసులు సజీవంగా పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని విమర్శించారు. అడవుల్లోని ఖనిజసంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకే ప్రభుత్వం ఈ రక్తపాతానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ మరణంపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరపాలని వారు డిమాండ్‌ చేశారు.

భాగ్య మృతదేహాన్ని అప్పగించే సమయంలో కాంకేర్‌ ఆస్పత్రి వద్ద ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆమె చూపిన ధైర్యానికి సెల్యూట్‌ చేసినట్లు సమాచారం. ఆమెలో ఉన్న తెగింపు ఎవరిలోనూ చూడలేదని.. లొంగిపోవడానికి నిరాకరించి, తన ఆశయాల సాధన కోసం ప్రాణత్యాగం చేస్తానని పోలీసుల ముందే ఖరాఖండిగా చెప్పినట్టు విలేఖరులతో తెలిపింది. ఇక పోలీసులు భాగ్యను పట్టుకున్నప్పుడు ఆమె సాదాసీదా దుస్తుల్లో నిరాయుధంగా ఉన్నారని స్థానికులు తెలిపారు. లొంగిపోవాలని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడించినా ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ‘నాతో పాటు పనిచేసిన వారిని ఎలాచంపారో.. నన్ను కూడా అలాగే చంపండి.’ అని పోలీసులతో గట్టిగా చెప్పినట్టు సమాచారం. తనపై ఉన్న రూ. 5లక్షల రివార్డును ప్రజలకే పంచాలని ఆమె కోరినట్లు స్థానికులు పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 04:22 AM