Share News

కంటి సమస్యలున్నా బండి నడిపేస్తున్నారు!

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:53 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో వాహనాలు నడపడమంటే ఎప్పుడూ సవాలే. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి అనేలా వాహన రద్దీ ఉంటుంది

కంటి సమస్యలున్నా బండి నడిపేస్తున్నారు!

  • హైదరాబాద్‌లోని వాణిజ్య వాహనాల డ్రైవర్లలో చాలామందికి దృష్టి లోపం

  • రవాణా శాఖ వైద్య శిబిరంలో బయటపడిన భయపెట్టే అంశం

  • 126 మందిలో 45 మందికి దృష్టి లోపం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో వాహనాలు నడపడమంటే ఎప్పుడూ సవాలే. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి అనేలా వాహన రద్దీ ఉంటుంది. హైదరాబాద్‌ రోడ్లపై క్యాబ్‌లు, ఆటోలు, లగేజీ క్యారియర్లు వంటి వాణిజ్య వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఈ వాణిజ్య వాహనాలను నడిపే డ్రైవర్లలో చాలా మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు సక్రమంగా లేకున్నా వాహనాలను నడిపేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు, కారణమవుతున్నారు. కాటర్టాక్‌ వంటి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న వారు కూడా వాణిజ్య వాహనాలను నడిపేస్తుండడం మరింత కలవర పెట్టే అంశం. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమాజిగూడలోని రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరంలో డ్రైవర్లలోని దృష్టి లోపం సమస్య బయటపడి చర్చనీయాంశమైంది. ఈ వైద్య శిబిరంలో భాగంగా మొత్తం వాణిజ్య వాహనాల డ్రైవర్లు 126 మందికి ఆర్‌టీఏ అధికారులు కంటి పరీక్షలు చేయించారు. ఆ 126 మందిలో 36 శాతం మంది అనగా 45 మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. అలాగే మరో ఐదుగురికి కాటరాక్ట్‌ శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. నిజానికి, డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. చూపు మందగించినట్టు గుర్తిస్తే తగిన వైద్యం చేయించుకోవాలి. కానీ చాలా మంది డ్రైవర్లు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకునేలా రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించాలి. కానీ రోడ్డు భద్రతా వారోత్సవాలు/ మాసోత్సవాల సమయంలో హడావిడి చేస్తోన్న అధికారులు అనంతరం ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు.

నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లతో..

40 ఏళ్ల పైబడిన వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌, గడువు ముగిసిన లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేస్తే మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. 50 ఏళ్ల వయస్సు పైబడిన వారైతే కంటి పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలి. హైదరాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. రూ.100 ఇస్తే.. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆయా సర్టిఫికెట్లు అక్కడికక్కడే ఇస్తున్నారు. సోమాజిగూడలో అయితే జిరాక్స్‌ సెంటర్లలో సర్టిఫికెట్లు ఇస్తుండడం గమనార్హం. వాటిని పరిశీలించకుండా అధికారులు కూడా లైసెన్సులు జారీ చేస్తుడడం ఆందోళనకరం.

Updated Date - Jan 22 , 2026 | 04:53 AM