Share News

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:06 AM

శుభక్షేత్ర ప్రై. లిమిటెడ్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసులో.. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

  • నేడో రేపో పోలీస్‌ కస్టడీకి రమావత్‌ మధు.. పరారీలో ఉన్న

  • ప్రధాన నిందితులు ఏపీలో తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానం

  • న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం

  • మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్‌లదే కీలకపాత్ర.. పలువురు బాధితుల ఆవేదన

హైదరాబాద్‌ సిటీ, పంజగుట్ట, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): శుభక్షేత్ర ప్రై. లిమిటెడ్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసులో.. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగ్లీ తమ్ముడు శివ, రమావత్‌ మధు, హేమకాంత్‌ రెడ్డి ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే రమావత్‌ మధును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే ముఠా నల్లగొండ జిల్లా లో గోకుల నంద ఇన్‌ఫ్రా పేరుతో రూ.కోట్లలో కొట్టేసినట్లు సీఐడీ 5 కేసులు నమోదు చేసినసంగతి తెలిసిందే. ఆ కేసులు విచారణలో ఉండగానే నిందితుల ముఠా.. ‘ఏకం విత్‌ నేచర్‌’ అనే థీమ్‌తో శుభక్షేత్ర ప్రై. లిమిటెడ్‌ పేరుతో పెట్టుబడులు ఆహ్వానించారు. రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 101 గజాల స్థలాన్ని రిజిస్టర్‌ చేయడంతో పాటు.. ప్రతి నెలా 5 శాతం చొప్పున 42 నెలలపాటు రిటర్న్స్‌ వస్తాయని బురిడీ కొట్టించి రూ. కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో ఏప్రిల్‌-17న రమావత్‌ మధును రిమాండ్‌కు తరలించిన సైబరాబాద్‌ పోలీసు లు.. మిగిలిన ప్రధాన నిందితులు శివ, అతని స్నేహితుడు హేమకాంత్‌రెడ్డి సహా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న రమావత్‌ మధును పోలీ స్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబరాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. శనివారం తుది వాదనల అనంతరం న్యాయస్థానం మధును పోలీస్‌ కస్టడీకి అనుమతించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.


ఇప్పటికే ఈ కేసులో సింగర్‌ మంగ్లీ పాత్ర ఎంత మేరకు ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. పలు సాంకేతిక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. కాగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితులైన శివ, హేమకాంత్‌రెడ్డి ఏపీలోని తిరుమల-తిరుపతిలో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అమాయక, పేద గిరిజనులు, లంబాడీలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్న ఘటనలో సింగర్‌ మంగ్లీ, ఆమె సోదరుడు శివచౌహన్‌లది కీలక పాత్ర అని పలువురు బాధితులు ఆరోపించారు. న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అని వారన్నారు. గిరిజన సంఘా ల ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘాల నాయకులతో కలిసి.. బాధితులు మాట్లాడారు. తాము ఎలా మోసపోయామో వివరించారు. ‘‘కడుపు నిండా భోజనం తినక, కంటి నిండా నిద్ర లేక రోజులు గడుపుతున్నాం. ఇక మాకు ఆత్మహత్యే గతి’’ అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘరానా మోసంపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


పంజగుట్ట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

మంగ్లీ కేసుకు సంబంధించి గతంలో పంజాగుట్ట ఠాణాకు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు సీఐ రామకృష్ణ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష చేసిన అంశంలో కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదంటూ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతవారం ఇచ్చిన ఆదేశాల మేరకు ఠాణాలో సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరిచారా? అని ప్రశ్నించింది. పోలీసులు, అడ్వొకేట్లు కలిసి పనిచేయాలని హితవు పలికింది. కాగా మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును లాయర్‌ సుబ్బారావు కోరారు. ఈ కేసు విచారణను కోర్టు వేసవి సెలవుల అనంతరం చేపట్టనుంది.

Updated Date - Apr 25 , 2026 | 07:07 AM