Share News

బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకే నాపై తప్పుడు ఆరోపణలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:04 AM

నా పేరు వాడుకుని ఫేమస్‌ అవ్వాలని, తద్వారా బిగ్‌బా్‌సలోకి వెళ్లాలనే న్యాయవాది సుబ్బు(సుబ్బారావు) నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు...

బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకే నాపై తప్పుడు ఆరోపణలు

  • నా పేరు వాడుకుని ఫేమస్‌ కావాలనే యత్నం

  • న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ ఫిర్యాదు

పంజాగుట్ట, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘నా పేరు వాడుకుని ఫేమస్‌ అవ్వాలని, తద్వారా బిగ్‌బా్‌సలోకి వెళ్లాలనే న్యాయవాది సుబ్బు(సుబ్బారావు) నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని సింగర్‌ సత్యవతి ముడావత్‌ అలియాస్‌ మంగ్లీ ఆరోపించారు. ఈమేరకు ఆదివారం ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అతను దుష్ప్రచారం చేస్తున్నాడని, వారంటున్న ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గత నెల 22న తాను ఓ న్యాయవాది కార్యాలయానికి వెళ్లినపుడు అక్కడున్న సుబ్బారావు తనతో అనుచితంగా మాట్లాడాడని మంగ్లీ అన్నారు. దీంతో నన్నెందుకు మీడియా ముందు అవమానిస్తున్నావని తాను అత న్ని ప్రశ్నించగా.. సామాజిక మాధ్యమాల్లో నుంచి కొన్ని వీడియోలను తొలగించడానికి సుబ్బు డబ్బులు డిమాండ్‌ చేశాడన్నారు. తాను నిరాకరించడంతో అతను, అతని అనుచరులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ తనపై సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. నిజంగా తనకు ఇందులో పాత్ర ఉంటే ఏ పోలీస్‌స్టేషన్‌కైనా.. కోర్టుకైనా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బంజారా గిరిజన ఆడబిడ్డనైన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. కష్టపడి 14 ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కానని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆర్థిక నేర బాధితులను చూస్తుంటే తనకే బాధ కలుగుతోందన్నారు. గాయనిగా తనతో చాలామంది ఫొటోలు దిగుతారని, అలాంటివారెవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏంటన్నారు. సీఐడీలో కేసు ఏడాదిగా నడుస్తోందని తప్పుడు ఆరోపణలపై చట్టప్రకారం ముందుకెళ్తామన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 06:04 AM