Share News

రమావత్‌ మధు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు

ABN , Publish Date - May 01 , 2026 | 05:08 AM

శుభక్షేత్ర పేరుతో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ గాయని మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు ...

రమావత్‌ మధు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు

  • శివ చౌహాన్‌ అకౌంట్‌కు మూడు సార్లు భారీగా నగదు వెళ్లినట్లు గుర్తింపు

  • పోలీస్‌ కస్టడీలో రమావత్‌ మధు.. 4 రోజుల కస్టడీకి కోర్డు అనుమతి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): శుభక్షేత్ర పేరుతో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ గాయని మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించినప్పటికీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్టు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌-ఈవోడబ్ల్యూ) పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్‌ మధు బ్యాంకు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు మూడుసార్లు భారీగా నగదు బదిలీ అయినట్లు, ఖాతాలో డబ్బు పడిన రోజే ఉపసంహరణ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అలాగే.. మధు ఖాతాను ఈవోడబ్ల్యూ జప్తు చేసినట్లుగా తెలుస్తోంది. మంగ్లీ ఖాతాలను కూడా క్షుణ్నంగా పరిశీలించాలనే నిర్ణయానికి వారు వచ్చినట్టు.. త్వరలోనే ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పోలీసు కస్టడీకి మధు..

ఈ కేసులో మరిన్ని విషయాలు వెలికితీయాల్సి ఉందని.. ఆర్థిక లావాదేవీలు, భూముల పత్రాలు, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై విచారణ అవసరమని ఈవోడబ్ల్యూ అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో న్యాయస్థానం రమావత్‌ మధును నాలుగు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి ఇవ్వడానికి గురువారం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకకు చెందిన వందలాది మంది బాధితులు కోట్లాది రూపాయలను మధుకు చెల్లించినట్లు ఆరోపణలు వెలువత్తుతుండడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారిస్తున్నారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వాములు ఎంత మంది? భూములను ఎక్కడ కొన్నారు. ఆ భూముల్లో లే-అవుట్లకు అనుమతులు ఉన్నాయా? ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు.? వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి ఖాతాలకు వెళ్లాయన్న అంశాలపై ప్రధానంగా వారు దృష్టి సారించారు.

Updated Date - May 01 , 2026 | 05:08 AM