Share News

ప్రకృతి వైపరీత్యానికి నలుగురు బలి

ABN , Publish Date - May 07 , 2026 | 05:42 AM

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

ప్రకృతి వైపరీత్యానికి నలుగురు బలి

  • పంటను కాపాడుకునేందుకు వెళ్లి ముగ్గురు...

  • కొడుకును బస్సెక్కించి వస్తుండగా మరొకరు మృతి

  • మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం

మంచిర్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పంటను కాపాడుకునే ప్రయత్నంలో ముగ్గురు రైతులు మృత్యువాత పడడం స్థానికులను కలచివేసింది. కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు సత్తయ్య తనకున్న ఎకరన్నర పొలంలో పండిన ధాన్యాన్ని మండలంలోని కొత్తూరు కొనుగోలు కేంద్రానికి తరలించారు. వర్ష సూచనలతో ధాన్యం తడవకుండా ఉండేందుకు తన చిన్న కుమారుడు వెంకటేష్‌ (23)తో కలిసి టార్పాలిన్‌ కవర్లు కప్పడానికి కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. కవర్లు కప్పుతుండగా గాలివాన ఒక్కసారిగా పెరగడంతో పక్కనే ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లారు. అయితే, బలమైన గాలులకు షెడ్డుతో పాటు గోడ కూలి మీద పడడంతో వెంకటేష్‌ మృతిచెందాడు. ఇదే తరహాలో గంపలపల్లికి చెందిన తనుగుల నాగరాజు (45), ఆయన కుమారుడు అభిరామ్‌ (24) ధాన్యం కుప్పలపై టార్పాలిన్‌ కవర్లు కప్పేందుకు మెప్మా కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ఇంతలో ఒక్కసారిగా గాలి వాన రావడంతో సమీపంలోని రేకుల షెడ్డు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో వీచిన ఈదురు గాలులకు షెడ్డు గోడ కూలి తండ్రీ కొడుకులిద్దరూ మృత్యువాత పడ్డారు. మరో ఘటనలో, దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నల్కి లచ్చన్న (50) తన కుమారుడుని హైదరాబాద్‌ బస్సు ఎక్కించడానికి ద్విచక్ర వాహనంపై లక్షెట్టిపేట బస్టాండ్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం మొదలవడంతో కొత్తూరు సమీపంలోని షెడ్డులో ఆశ్రయం పొందారు. అదే సమయంలో షెడ్డు కూలడంతో తీవ్ర గాయాలపాలైన లచ్చన్న, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రే కన్నుమూశారు. ఈ ఘటనలపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, తన వంతు సాయంగా రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.7లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - May 07 , 2026 | 05:42 AM