నిర్వహణ లోపం.. రైతులకు శాపం..
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:37 AM
-పశువులు పడుకున్న చోటనే పండించిన కూరగాయలను రైతులు ఇలా విక్రయిస్తున్నారు. ఇదేదో రోడ్డు పక్కన అనుకునేరు. కరీంనగర్ శనివారం అంగడి పారంతంలోని రైతుబజార్ పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా
-పశువులు పడుకున్న చోటనే పండించిన కూరగాయలను రైతులు ఇలా విక్రయిస్తున్నారు. ఇదేదో రోడ్డు పక్కన అనుకునేరు. కరీంనగర్ శనివారం అంగడి పారంతంలోని రైతుబజార్ పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు బురద.. మరో వైపు పశువులు.. రైతులు ఇబ్బందుల మధ్య అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్ ప్రాంగణంలో సరైన వసతులు లేకపోవడంతో కూరగాయలు అమ్మే రైతులు, కొనుక్కునే నగరవాసులు సతమతమవుతున్నారు. గతంలో షెడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్వహణ, నిర్మాణాల విషయంలో సరైన ప్రణాళిక కొరవడింది. జిల్లాకేంద్రానికి వచ్చే వందలాది మంది రైతులకు కూరగాయాలు అమ్ముకునే సదుపాయాన్ని పక్కాగా చేపట్టకపోవడంతో కొన్నేళ్లుగా రోడ్లమీదనే వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో రహదారులపై వెళ్లే వారికి ట్రాఫిక్ చిక్కులు తప్పడంలేదు. మరోవైపు ఉన్నవాటికి అదనంగా కొత్త ఇంటిగ్రేటెడ్ సముదాయాలు నిర్మిస్తుండగా అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. పద్మానగర్‌లో 2.08 ఎకరాల్లో 13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన మార్కెట్ సముదాయంలో ఇంకా సేవలు ప్రారంభం కాలేదు. ఇక్కడ నెలవారీ అద్దెలు షట్టర్లకు 25 వేలు, ఫ్లాట్‌ఫామ్‌కు వెయ్యి రూపాయల వరకు ఉండటం వల్ల అంతదూరం రైతులు, చిరువ్యాపారులు వెళ్లడం లేదు. ఇక్కడ ఉన్న 239 దుకాణాలతోపాటు కూరగాయాల కోసం ఉన్న 179 ఫ్లాట్‌ఫామ్‌లు, 32 మాంసపు విక్రయ వేదికలు వృథాగానే ఉన్నాయి. కశ్మీర్గడ్డలో ఉన్న పాత మార్కెట్ స్థలంలోనే కొత్తదానికి ఇటీవల సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న మరో ఇంటిగ్రేటెడ్ సముదాయాన్ని 14.5 కోట్లతో నిర్మిస్తుండగా అది ఇంకా పూర్తికాలేదు. దీంతో ఈ నిర్మిత స్థలం సమీపంలో వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట ఉన్న మార్కెట్ రోడ్డులోనే కూరగాయలు, పండ్ల వ్యాపారాలు కొనసాగుతుండడంతో అటు వ్యాపారులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆదాయం వస్తున్నా...
నగరంలో ప్రస్తుతం నడుస్తున్న పలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో చిన్న దుకాణాల అద్దెల ద్వారా కొంత ఆదాయం సమకూరుతోంది. శనివారం మార్కెట్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని పలు మడిగెలకు వ్యాపారులు నెలకు రూ.1000కిపైగా అద్దెను చెల్లిస్తున్నారు. దీంతోపాటు టోకు వ్యాపారుల నుంచి కొంత రుసుము వసూలవనుంది. వీటితోపాటు మార్కెటింగ్ శాఖకు వచ్చే నిధులతో ఇక్కడ వసతులు కల్పించాలి. కానీ 2016 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వేసిన శిలాఫలకాలు అలంకారప్రాయంగా మారాయి. అదనపు షెడ్ల నిర్మాణం సహా ఇక్కడ ఉన్న సమస్యలను తీరుస్తామనే మాటలు అటకెక్కాయి. ఇక్కడికి వచ్చే వ్యాపారులు మూత్రశాలను వినియోగించడానికి పురుషుల నుంచి 10, మహిళలనుంచి ఐదు రూపాయల యూజర్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇక్కడ నిర్మించిన నాన్‌వెజ్ మార్కెట్ బహుళ అంతస్తుల భవనం ఇప్పటికీ అలంకారప్రాయంగానే ఉంది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులో విక్రయాలు జరగలేదు. నిత్యం ఇక్కడి రైతు బజార్‌కు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు వందల సంఖ్యలో రైతులు వస్తుండడంతో వారికి కనీస వసతులు కల్పించడంతోపాటు పారిశుధ్య నిర్వహణను మరింతగా మెరుగు పర్చాలి. ప్రాంగణమంతా సిమెంట్ కాంక్రీట్(సీసీ) నిర్మాణం చేపట్టడంతోపాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి. పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇక్కడ నిర్వహణపై మార్కెటింగ్ శాఖ తగిన దృష్టి పెట్టాలి. నగరంలోని మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు, నిర్వహణలపై కార్పొరేషన్ తగిన శ్రద్ధను కనబర్చి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలి.