ప్రేయసిని హత్తుకొని.. నిప్పు పెట్టుకొని!
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:14 AM
ఆమె భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. అతడేమో భార్య చనిపోవడంతో పిల్లలను అన్నీతానై చూసుకుంటున్నాడు!
వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో వ్యక్తి దుశ్చర్య
ఇద్దరికి తీవ్రగాయాలు.. మహబూబాబాద్‌లో ఘటన
ఎంజీఎంలో చికిత్స.. ఇద్దరి పరిస్థితి విషమం
మహబూబాబాద్ క్రైం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆమె భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. అతడేమో భార్య చనిపోవడంతో పిల్లలను అన్నీతానై చూసుకుంటున్నాడు! వీధిలో ఎదురెదురుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆమెకు, అతడికి మధ్య కలిసిన మాటలు వివాహేతర సంబంధం ఏర్పడే దాకా వెళ్లాయి! కొన్నాళ్లుగా పెళ్లి చేసుకుందాం అంటూ అతడు చెబుతుంటే ఆమె ఒప్పుకోవడం లేదు. అతడి నుంచి ఒత్తిడి భరించలేక మరో చోటుకు ఆమె మకాం మార్చేసింది. ఉన్మాదిగా మారిన అతడు ‘పెళ్లికి ఒప్పుకోని నిన్ను బతకనివ్వను. నేనూ బతకను’ అంటూ ఆమె ఒంటిపై పెట్రోలు పోసి.. కౌగిలించుకొని నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటనలో మంటలకు తీవ్రగాయాలవడంతో ఇద్దరూ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మహబూబాబాద్‌లో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన బానోతు సంధ్య అలియాస్ మంజులకు అదే మండలానికి చెందిన వీరన్న అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. 2018లో సంధ్య, భర్తతో విడిపోయి.. పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో తల్లి వద్ద ఉంటోంది. పిల్లలను పోషించుకునేందుకు కూరగాయలు అమ్ముకుంటోంది. కురవి మండలం మోదుగులగూడేనికి చెందిన కుంట అంజయ్యకు అదే మండలానికి చెందిన స్వప్నతో పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. 2020లో స్వప్న అనారోగ్యంతో చనిపోయింది. అంజయ్య ప్రగతినగర్‌కొచ్చి పాల వ్యాపారం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నాడు. అక్కడే సంధ్య కూరగాయలు అమ్ముతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి..వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొన్నాళ్లుగా అంజయ్య పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి తెస్తుండటంతో సంధ్య గత నవంబరులో హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడ కూలి పనులు చేసుకుంటోంది. ఇటీవలే ప్రగతినగర్‌లో ఉంటున్న తల్లి దగ్గరకు ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న అంజయ్య మంగళవారం మధ్యాహ్నం పెట్రోలుబాటిల్‌ను చేతిలోపట్టుకొని వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో సీసాలోని పెట్రోలును ఆమె మీద కుమ్మరించి.. ఆమెను దగ్గరకు లాక్కొని నిప్పటించాడు. స్థానికులు మంటలార్పి ఇద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.