Share News

బీఆర్‌ఎస్‌కు మల్లారెడ్డి గుడ్‌బై?

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:20 AM

బీఆర్‌ఎస్‌ కీలక నేత, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఆ పార్టీని వీడతారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తాజాగా ఊపందుకుంది.

బీఆర్‌ఎస్‌కు మల్లారెడ్డి గుడ్‌బై?

  • కార్యక్రమాలకు హాజరుకాని మేడ్చల్‌ ఎమ్మెల్యే

  • 18న ఘట్‌కేసర్‌లో సీఎం సభకు హాజరు

  • కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌ విమర్శలు

  • సభ ముగిశాకైనా ఖండించని మాజీ మంత్రి

  • సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఫైర్‌

  • పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

  • మల్లన్నా.. మౌనమేల?: క్రిశాంక్‌ ప్రశ్న

హైదరాబాద్‌/మేడ్చల్‌/మేడ్చల్‌ టౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కీలక నేత, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఆ పార్టీని వీడతారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి.. ఈ నెల 18న ఘట్‌కేసర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సభకు హాజరు కావడమే ఇందుకు కారణం. అంతేకాదు.. సభలో రేవంత్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. సభ ముగిసిన తర్వాతనైనా, కనీసం మరుసటి రోజైనా (ఆదివారమైనా) రేవంత్‌ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆవేదన చెందాయి. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకున్నా.. సీఎం విమర్శలపై ప్రైవేటుగానైనా స్పందించలేదని మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు ‘ఇప్పుడు ఏం బ్లాక్‌మెయిల్‌ చేశాడని సైలెంట్‌ అయినవ్‌ మల్లన్నా?’ అంటూ బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ ప్రశ్నించారు. ఈ పరిణామాల తరువాత కూడా మల్లారెడ్డి స్పందించకపోవడంతో ఆయన బీఆర్‌ఎ్‌సలో ఉన్నట్లా? లేనట్లా? అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి మల్లారెడ్డిపై మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గతంలోనే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండడంతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా హాజరు కావడంలేదు. దీంతో ఈ బాధ్యతలను వీలైతే ఇంకెవరికైనా అప్పగిస్తే మంచిదని వారు కోరారట.

కుటుంబంతో కలిసి ప్రధాని మోదీ వద్దకు

మల్లారెడ్డి గతంతో తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. తనవిద్యాసంస్థల వ్యాప్తిలో భాగంగానే ప్రఽధానిని కలిసిన ట్టు సన్నిహితులు చెప్పుకొచ్చినా.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు బీజేపీలో చేరడానికే మోదీని కలిశారని నమ్ముతున్నారు. వ్యాపా ర సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరింపజేసేందుకు బీజేపీ ప్రభుత్వం మద్దతు కోసం మల్లారెడ్డి యత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనను తమ పార్టీలో తీసుకురావాలని భావించిన కాంగ్రెస్‌ సీనియర్లు పీసీసీ స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలిసింది. గతంలో ఆయన ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌నూ కలిశారు. పైగా ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు.

Updated Date - Jul 20 , 2026 | 07:27 AM