Share News

మల్లారెడ్డి గ్రూప్‌ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:07 AM

మల్లారెడ్డి రెడ్డి గ్రూప్‌నకు చెందిన ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలతో పాటు పలు ప్రైౖవేటు యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

మల్లారెడ్డి గ్రూప్‌ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు

  • నాలుగు రోజులుగా అర్ధరాత్రి వరకు సోదాలు

  • రంగంలోకి 10 బృందాలు..70 అంశాలపై వివరాల సేకరణ

హైదరాబాద్‌ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మల్లారెడ్డి రెడ్డి గ్రూప్‌నకు చెందిన ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలతో పాటు పలు ప్రైౖవేటు యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు లీగల్‌, ఆడిట్‌, ఫైనాన్స్‌, రెవెన్యూ అధికారులతో పాటు జేఎన్‌టీయూ ఆచార్యులతో కలిపి మొత్తం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనె 17 నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు మల్లారెడ్డి కాలేజీలతో పాటు వాటి అనుబంధ కాలేజీలుగా భావిస్తున్న సీఎంఆర్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీ, అనురాగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో జేఎన్‌టీయూ నిర్వహించిన సాధారణ ఎఫ్‌ఎఫ్‌సీ తనిఖీలకు భిన్నంగా, ఈసారి సుమారు 70 రకాల అంశాలతో కూడిన ఫార్మాట్‌లో కాలేజీ వివరాలను సేకరిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు (కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు) అధికారుల బృందాలు కాలేజీల్లోనే ఉండి పరిశీలిస్తున్నాయి. ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై బీటెక్‌ 2, 3, 4వ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సుమారు 30 మంది జేఎన్‌టీయూ ఆచార్యులను ఈ తనిఖీల కోసం ప్రైవేటు కాలేజీలకు పంపడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jul 21 , 2026 | 05:10 AM