Share News

మల్కాజిగిరిలో ‘హెల్మెట్‌ బ్యాంక్‌’

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:34 AM

మోటారు సైకిల్‌.. స్కూటీపై వెళుతున్నప్పుడు మనం సరిగ్గానే డ్రైవింగ్‌ చేస్తున్నా.. రోడ్డుపై ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు.

మల్కాజిగిరిలో ‘హెల్మెట్‌ బ్యాంక్‌’

  • పోలీసుల వినూత్న ప్రయోగం

  • శిరస్త్రాణం లేని వాహన చోదకులకు ట్రాఫిక్‌ పోలీసుల హెల్మెట్ల పంపిణీ

  • కొత్త హెల్మెట్‌ కొనుక్కుని 24 గంటల్లో శిరస్త్రాణం అప్పగించాలి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మోటారు సైకిల్‌.. స్కూటీపై వెళుతున్నప్పుడు మనం సరిగ్గానే డ్రైవింగ్‌ చేస్తున్నా.. రోడ్డుపై ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి హెల్మెట్‌ ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా పౌరులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అత్యధిక ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్‌ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు మృతి చెందుతున్నారని చెబుతూ వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రహదారి భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు మల్కాజిగిరి-మేడ్చల్‌ జిల్లా పోలీసులు. రోడ్డు ప్రమాదాలు తగ్గించి, మరణాల నివారణకు ‘హెల్మెట్‌ బ్యాంక్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మల్కాజిగిరి జోన్‌లో హెల్మెట్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంగీత్‌ చౌరస్తా సహా.. మల్కాజిగిరి జోన్‌లోని కీలక ట్రాఫిక్‌ జంక్షన్లలో హెల్మెట్లను అందజేశారు.

ఏంటీ.. హెల్మెట్‌ బ్యాంక్‌..

హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులను ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకుంటారు. తర్వాత వారికో హెల్మెట్‌ అందించి.. వారి ఫోన్‌ నంబర్‌, చిరునామా, వాహనం వివరాలు నమోదు చేసుకుని వదిలేస్తారు. తర్వాత 24 గంటల్లోపు కొత్త హెల్మెట్‌ కొనుగోలు చేసి తిరిగి ఆ హెల్మెట్‌ను పోలీసులకు అప్పగించాలి.

హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత

‘ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. హెల్మెట్‌ ధరించడం బరువు కాదు.. అది బాధ్యత అని గుర్తుంచుకోవాలి. మనం చేసే చిన్న పొరపాటు వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీరని నష్టం జరుగుతుంది. యజమాని మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని గ్రహించాలి. హెల్మెట్‌ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పనకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బైక్‌పై రోడ్డు మీదకొచ్చే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్‌ ధరించాలి.

- రాహుల్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ, మల్కాజిగిరి జోన్‌

Updated Date - Feb 24 , 2026 | 04:34 AM