మక్తల్‌లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణం!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:44 AM
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని ఆరోవార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్ది ఎరుకలి మహదేవప్ప (45) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నారు.
ఎన్నికల ప్రచారం చేసి ఇంటికొచ్చిగదిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య
అంతుచూస్తామంటూ కాంగ్రెస్ నేతల బెదిరింపులతోనే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
మంత్రి వాకిటి ప్రోద్బలంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య: బీజేపీ
కాంగ్రెస్ బెదిరింపులతోనే..: కిషన్‌రెడ్డి
నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేయడంతోనే: లక్ష్మణ్
మక్తల్, హైదరాబాద్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని ఆరోవార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్ది ఎరుకలి మహదేవప్ప (45) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మహదేవప్ప వార్డు పరిధిలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి చికెన్ ప్యాకెట్లు పంపిణీ చేసి ఇంటికి చేరుకున్నారు. స్నానానికి వేన్నీళ్లు పెట్టాలని భార్యకు చెప్పి.. బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొద్దిసేపటికి భార్య తలుపులు తీసి చూడగా మహదేవప్ప చీరకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. కౌన్సిలర్‌గా గెలిస్తే అంతుచూస్తామంటూ కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఫోన్లు చేసి బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మహదేవప్ప తల్లి అనంతమ్మ, భార్య సత్యమ్మ ఆరోపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ రాంలాల్ తెలిపారు. మృతుడి భార్య సత్యమ్మ, తల్లి అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. కాగా మహదేవప్ప మృతితో ఆరో వార్డు పోలింగ్‌ను వాయిదా వేసినట్లు రిటర్నింగ్ అధికారి శివయ్య వెల్లడించారు. ఆరోవార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో అన్నదమ్ముల పిల్లలైన ముగ్గురు సోదరులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి మహదేవప్ప, కాంగ్రెస్ నుంచి మారెప్పలు పోటీచేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి బరిలో ఉన్నా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండటంతో మహదేవప్ప, మారెప్ప హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: రాంచందర్‌రావు
మహదేవప్పది ఆత్మహత్య కాదని.. కాంగ్రెస్ చేసిన హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అరోపించారు. ఆత్మహత్యకు మంత్రి వాకిటి శ్రీహరి బెదిరింపులే కారణం అని ఆరోపించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్తల్ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని చూసిన అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి బాధిత కుంటుబాన్ని ఓదార్చారు. అంతకుముందు ఆస్పత్రి వద్ద డీకే అరుణ, ఇతర బీజేపీ నేతలతో కలిసి రాంచందర్‌రావు విలేకర్లతో మాట్లాడారు. కొన్నాళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్న మహాదేవప్పను మంత్రి వాకిటి శ్రీహరి ప్రోద్బలంతో కొందరు స్థానిక నాయకులు పనిగట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ విషయాన్ని బాధితుడు తన తల్లి, భార్యకు చెప్పినట్లు పేర్కొన్నారు. వారు అధైర్యపడొద్దని చెప్పినా చివరకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కాల్‌డేటా ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ, ఎస్సైలు ఎఫ్‌ఐఆర్ మార్చారని.. వారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని.. రాష్ట్రంలో వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహదేవప్ప కుటుంబసభ్యులకు బీజేపీ రాష్ట్ర పార్టీ తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు బెదిరించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని, కారకులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మృతుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌డేటాను బయటకు తీస్తే ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వెలుగులోకొస్తాయని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేసిన హత్యే: బండి సంజయ్
మక్తల్‌లో బీజేపీ కార్యకర్త మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్యే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీని రాళ్లతో కొట్టే పరిస్థితి రానుందని వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దు అని హెచ్చరించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహదేవప్ప ఆత్మహత్య ఘటనకు నిరసనగా తాము డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతల దౌర్జన్యం, వేధింపులే కారణమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
పార్లమెంటులో ప్రస్తావన
మహదేవప్ప ఆత్మహత్య ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడటం, దౌర్జన్యం చేయడం వల్లే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని సభలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఒత్తిడి చేయడంతో గిరిజన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్ల వల్ల తమ పార్టీ కౌన్సిలర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి సంబంధం లేదు : మంత్రి వాకిటి
మహాదేవప్ప ఆత్మహత్య ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం బీజేపీ నాయకులు మహాదేవప్ప మరణాన్ని రాజకీయం చేయడం బాధ కలిగిస్తోందన్నారు. మహదేవప్ప కుటుంబానికి అండగా నిలబడాల్సిన ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.